కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ సర్కారు

ABN , First Publish Date - 2021-08-10T05:41:56+05:30 IST

దేశభక్తి పేరుతో దేశాన్ని విదేశీ కార్పొరేట్‌ శక్తులకు అమ్మజూపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు అన్నారు.

కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ సర్కారు
ర్యాలీ నిర్వహిస్తున్న అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు

ప్రైవేటీకరణ చర్యలతో పరాధీనమవుతున్న భారత్‌

విదేశీ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలి

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు

విశాఖపట్నం, ఆగస్టు 9: దేశభక్తి పేరుతో దేశాన్ని విదేశీ కార్పొరేట్‌ శక్తులకు అమ్మజూపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు అన్నారు. నాటి క్విట్‌ ఇండియా పోరాటం స్ఫూర్తితో పోరాడి దేశ సంపదను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాలోని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సరస్వతీ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నరసింగరావు మాట్లాడుతూ దేశ ఆర్థికరంగానికి పునాది ప్రభుత్వ రంగ సంస్థలని, అటువంటి సంస్థలను అమ్మేసి ఆర్థిక పునాదులే కదిలిపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో 70 శాతం మంది ఆధారపడి బతుకుతున్న వ్యవసాయరంగాన్ని నాశనం చేసేందుకు మూడు నల్లచట్టాలు తెచ్చారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గితే, దేశంలో మాత్రం వంద శాతం పెరిగాయన్నారు.


ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలే దేశానికి ఆర్థిక వనరులని, వాటిని అమ్ముకుంటూ పోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ల పరమైతే, బీమా, రైల్వేల్లో కార్పొరేట్‌ శక్తులు పాగావేస్తే ఇక దేశాభివృద్ధికి ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటారో బీజేపీ పాలకులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఆఖరికి దేశ ప్రజానీకాన్ని కూడా అమ్మేందుకు మోదీ ఆధ్వర్యంలోని కాషాయి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఆందోళనలో అఖిల పక్షం నాయకులు సోడదాసు సుధాకర్‌, ఆదినారాయణ, రామచంద్రరావు, కనకారావు, ఎం.జగ్గునాయుడు, పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T05:41:56+05:30 IST