ఎయిడెడ్‌ లెక్క తేలింది

ABN , First Publish Date - 2021-10-21T05:58:59+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ పరిధిలోకి రానున్న ఎయిడెడ్‌ పాఠశాలలు, బోధన, బోధనేతర సిబ్బంది లెక్క తేలింది.

ఎయిడెడ్‌ లెక్క తేలింది

 ఆస్తుల అప్పగింతకు ముందుకొచ్చన తొమ్మిది పాఠశాలల యాజమాన్యాలు 

బోధన, బోధనేతర సిబ్బంది సరండర్‌కు మరో 62 పాఠశాలల అంగీకారం

మరో 18 పాఠశాలలు రెండింటికీ విముఖం

నెలాఖరులోగా సమీప పాఠశాలలకు విద్యార్థులు

తల్లిదండ్రుల ఆందోళన

వచ్చే నెల ఏడో తేదీలోగా ఎయిడెడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ పరిధిలోకి రానున్న ఎయిడెడ్‌ పాఠశాలలు, బోధన, బోధనేతర సిబ్బంది లెక్క తేలింది. మొత్తం 89 పాఠశాలలకు గాను ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించడానికి తొమ్మిది పాఠశాలల యాజమాన్యాలు ముందుకువచ్చాయి. మరో 62 పాఠశాలలు కేవలం టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను అప్పగించాలని నిర్ణయించాయి. మిగిలిన 18 పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఆస్తులు, టీచర్లను అప్పగించడానికి నిరాకరించాయి. ఈ మేరకు విద్యా శాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. 


బోధన, బోధనేతర సిబ్బందిని అప్పగించేందుకు ముందుకొచ్చిన 62 పాఠశాలల్లో 35 ప్రాథమిక, ఆరు ప్రాథమికోన్నత, 21 ఉన్నత పాఠశాలలు వున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఆస్తులతోపాటు టీచర్లను అప్పగించనున్న తొమ్మిది కూడా ప్రాథమిక పాఠశాలలే. ప్రస్తుతం ఈ 72 పాఠశాలలపై విద్యా శాఖ  అధికారులు దృష్టిసారించారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సమీపంలో గల ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌ పాఠశాలలకు పంపుతారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు తీసుకుంటున్నారు. ఆ 72 పాఠశాలల్లో చదివే 9,600 విద్యార్థులను నెలాఖరుకు వేరే పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవోలను జిల్లా విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. ఒకవేళ సమీప పాఠశాలల్లో వసతి కొరత ఉన్నట్టయితే...ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పుడు చదివే పాఠశాలల్లోనే కొనసాగేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రం పూర్తిగా సమీపంలో గల పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థుల చేరికను బట్టి ఆయా పాఠశాలల్లో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం 246 టీచింగ్‌, 30 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే నెల ఏడో తేదీలోగా కౌన్సెలింగ్‌ పూర్తిచేయనున్నారు. నగరంతోపాటు జిల్లాలో అవసరం వున్నచోట వీరికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. కొత్తగా పోస్టింగ్‌ వచ్చిన చోట జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చినా ఈ ఏడాదికి మాత్రం గతంలో పనిచేసిన ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే పనిచేయాల్సి రావచ్చునని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


నగరంపై ప్రభావం ఎక్కువ

గ్రామీణ, ఏజెన్సీ కంటే విశాఖ నగరంలో ఎక్కువగా ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఆర్‌సీఎం క్రిస్టియన్‌ మిషనరీకి చెందిన పాఠశాలల్లో టీచర్లను వెనక్కి పంపేస్తున్నారు. అందువల్ల అక్కడ చదివే విద్యార్థులను సమీపంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు. అయితే ఇప్పటివరకు చదివిన పాఠశాలను విడిచిపెట్టి మునిసిపల్‌ పాఠశాలలకు పంపడానికి పలువురు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి ఒకేసారి విద్యార్థులను సమీపంలో మునిసిపల్‌ పాఠశాలలో చేర్పించినా అక్కడ వసతి సమస్య ఎదురవుతుంది. కొత్తగా చేరిన విద్యార్థులకు సరిపడా వసతి ఏర్పాటుచేయాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చదివే చోట ఫీజులు చెల్లించి కొనసాగడం లేదా ప్రైవేటు పాఠశాలల్లో చేరడమే మార్గమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి సమస్య నగరంలో ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-10-21T05:58:59+05:30 IST