వ్యాపారుల వలలో ‘తాండవ’ మత్స్యకారులు

ABN , First Publish Date - 2021-08-25T05:47:22+05:30 IST

తాండవ జలాశయంలో రొయ్యల పెంపకానికి మత్స్య శాఖ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రిజర్వాయర్‌లో వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ప్రైవేటు వ్యాపారుల వలలో చిక్కుకుంటున్నారు. ఏటా జలాశయంలో రొయ్య పిల్లలను వదలడానికి వీరిని ఆశ్రయించాల్సి వస్తున్నది. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రొయ్యలను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యాపారుల వలలో ‘తాండవ’ మత్స్యకారులు
జలాశయంలో రొయ్య పిల్లలు వదులుతున్న ప్రైవేటు వ్యాపారులు (పాత చిత్రం)

జలాశయంలో పదేళ్ల నుంచి రొయ్య పిల్లలను వదలని అధికారులు

చేప పిల్లలు సైతం అంతంత మాత్రంగానే విడుదల

ఏటేటా మత్స్య సంపద తగ్గిపోతున్నదంటున్న మత్స్యకారులు

వేట సరిగా సాగక.. కనీస ఆదాయం కూడా రావడంలేదని ఆవేదన

రిజర్వాయర్‌లో రొయ్య పిల్లలు వదులుతున్న ప్రైవేటు వ్యాపారులు

పట్టుబడి తరువాత రొయ్యలను తమకే అమ్మాలని షరతు

వ్యాపారులు చెప్పిన ధరకే ఇవ్వాల్సిన దుస్థితి

తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటున్న మత్స్యకారులు


గొలుగొండ, ఆగస్టు 24:  తాండవ జలాశయంలో రొయ్యల పెంపకానికి మత్స్య శాఖ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రిజర్వాయర్‌లో వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ప్రైవేటు వ్యాపారుల వలలో చిక్కుకుంటున్నారు. ఏటా జలాశయంలో రొయ్య పిల్లలను వదలడానికి వీరిని ఆశ్రయించాల్సి వస్తున్నది. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రొయ్యలను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుగా తాండవ గుర్తింపు పొందింది. సుమారు ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం ఐదు టీఎంసీలు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 52 వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఎంతటి వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ రిజర్వాయర్‌ అడుగంటిన దాఖలాలు లేవు. గొలుగొండ, కొయ్యూరు మండలాల్లోని ఊటగెడ్డల నుంచి ఏడాది పొడవునా నీరు వచ్చి చేరుతుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది జీవ జలాశయం. ఈ నేపథ్యంలో గొలుగొండ మండలంలోని సాలికమల్లవరం, జోగంపేట, గొలుగొండ, జమ్మాదేవిపేట, పొగచెట్లపాలెం, వెంకటాపురం, అమ్మపేట, చోద్యం, గాదంపాలెం, విప్పలపాలెం, పాతమల్లంపేట, పప్పుశెట్టిపాలెం, రావణాపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 225 మంది మత్స్యకారులు ‘స్వదేశీ మత్యకారుల సొసైటీ’ పేరుతో జలాశయంలో చేప వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య శాఖ అధికారులు ఏటా వర్షాకాలంలో రిజర్వాయర్‌లో చేప, రొయ్య పిల్లలను విడుదల చేయాలి. కానీ సుమారు పదేళ్ల నుంచి చేప పిల్లలను మాత్రమే వదులుతున్నారు. అయితే చేపల కన్నా రొయ్యల ద్వారా అధిక ఆదాయం వస్తుండడంతో రిజర్వాయర్‌లో రొయ్య పిల్లలను కూడా విడుదల చేయాలని మత్స్యకారులు ఏళ్ల తరబడి అధికారులను కోరుతున్నారు. అయినా పట్టించుకోకపోవడంతో తునికి చెందిన రొయ్యల వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు ఏటా ఆగస్టు/ సెప్టెంబరు నెలల్లో రిజర్వాయర్‌లో రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నారు. అయితే పట్టిన రొయ్యలను వారికే, వారు నిర్ణయించిన రేటుకే విక్రయించాలని షరతు విధిస్తున్నారు. మత్స్య శాఖ అధికారులు రొయ్య పిల్లలను వదలకపోవడంతో రొయ్యల వ్యాపారులు అడిన ధరకు ఇవ్వాల్సి వస్తున్నదని మత్స్యకారులు వాపోతున్నారు.


Updated Date - 2021-08-25T05:47:22+05:30 IST