పుస్తకాలు లేకుండా పాఠాలా?

ABN , First Publish Date - 2021-07-12T05:49:03+05:30 IST

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను తెరవకుండా, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధించాలని నిర్ణయించింది.

పుస్తకాలు లేకుండా పాఠాలా?
పాఠశాలలకు పంపకుండా మండల కేంద్రాల్లో వుంచిన పాఠ్యపుస్తకాలు


నేటి నుంచి ఆన్‌లైన్‌లో విద్యా బోధన

దూరదర్శన్‌ సప్తగిరి ఛానెల్‌లో ఏర్పాట్లు

ఇంతవరకు పాఠశాలలకు చేరని పాఠ్యపుస్తకాలు 

పిల్లలు పాఠాలను ఎలా వింటారని తల్లిదండ్రులు, టీచర్ల ప్రశ్న

విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందజేయాలని సూచన


విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): 

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను తెరవకుండా, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధించాలని నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానెల్‌ ద్వారా పాఠాలు బోధనకు షెడ్యూల్‌ విడుదల చేసింది. కానీ పాఠ్యపుస్తకాలను ఇంతవరకు విద్యార్థులకు పంపిణీ చేయలేదు. పుస్తకాలు లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు ఎలా వింటారు? ఎలా అర్థం చేసుకుంటారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలోని 5,500 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారని విద్యా శాఖ అధికారుల అంచనా. వీరిలో మైదానంలో 2.2 లక్షల మంది, ఏజెన్సీలో 62 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. సాధారణంగా జూన్‌ రెండో వారంలో విద్యా సంస్థలను తెరుస్తుంటారు. గత ఏడాది కరోనా ప్రబలడంతో పాఠశాలలను దసరా సెలవుల తరువాత తెరిచారు. ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో ఇంతవరకు పాఠశాలలను తెరవలేదు. అయితే విద్యార్థులు ఇళ్ల వద్దనే పాఠాలు నేర్చుకునేలా చేయాలని  విద్యా శాఖ భావించింది. ఈనెల 12వ తేదీ నుంచి (సోమవారం) ఆన్‌లైన్‌లో పాఠాల బోధనకు షెడ్యూల్‌ ప్రకటించారు. దూరదర్శన్‌ సప్తగిరి ఛానెల్‌ ద్వారా పాఠాలు బోధన చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఒకటి, రెండో తరగతులు, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు 3, 4, 5 తరగతులకు; మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు ఆరు, ఏడు తరగతులకు, మూడు నుంచి నాలుగు గంటల వరకు 8, 9 తరగతులకు బోధిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా సంబంధ పాఠాలు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఇతర పాఠాలు బోధన చేయాలని షెడ్యూల్‌ ఖరారుచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరలేదు. దీంతో విద్యార్థులకు పంపిణీ చేయలేదు. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు ఎలా వింటారని తల్లిదండ్రులు, టీచర్లు ప్రశ్నిస్తున్నారు. బోధన తరువాత వెంటనే పాఠ్యపుస్తకం చూస్తే సందేహాలు నివృత్తి అవుతాయని, టీవీలో పాఠాలు విని అక్కడితో వదిలేస్తే ఫలితం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని, ఈలోగా పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు ప్రకటనపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తే  ఆన్‌లైన్‌లో పాఠాలు వినడానికి ఆసక్తి చూపుతారని అంటున్నారు.


15వ తేదీ నుంచి వర్క్‌షీట్లు 

కాగా సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు వర్క్‌షీట్లు అందజేయనున్నారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తారు. తరువాత టీచర్ల సూచన మేరకు వాటిని రాస్తారు. తిరిగివెనక్కి తీసుకుని విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేసే బాధ్యత టీచర్లదే. వచ్చే నెలలో పాఠశాలలను పునఃప్రారంభించే వరకు ప్రతి వారం విద్యార్థులకు వర్క్‌షీట్లు పంపిణీ చేస్తామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-12T05:49:03+05:30 IST