ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ ఆందోళన
ABN , First Publish Date - 2021-10-21T06:14:07+05:30 IST
రాష్ట్రంలో అరాచాక పాలన కొనసాగుతోందని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడాన్ని నిరసిస్తూ బుధవారం పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చేపట్టిన బంద్ చేపట్టారు.

బంద్‌లో పాల్గొనకుండా పలువురు నాయకులను ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేసిన పోలీసులు
అయినా పలుచోట్ల ఆందోళనలు చేసిన తెలుగు తమ్ముళ్లు
మల్కాపురం, అక్టోబరు 20: రాష్ట్రంలో అరాచాక పాలన కొనసాగుతోందని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడాన్ని నిరసిస్తూ బుధవారం పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చేపట్టిన బంద్ చేపట్టారు. అయితే పోలీసులు బంద్‌లో టీడీపీ నాయకులు పాల్గొనకుండా బుధవారం వేకువజామునే పలువురుని అరెస్టు చేయగా, మరికొంతమందిని గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ చాలాచోట్ల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మూర్తియాదవ్ నేతృత్వంలో హెచ్‌పీసీఎల్ లేబర్ గేటు వద్దకు అనేకమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని మల్కాపురం ప్రధాన రహదారిలో బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నాయకులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి సోమేశ్, కోరాడ శ్రీనివాసరావు, పొత్తబత్తుల శ్రీను, రామ్మోహన్నాయుడు, శంకరరావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
గోపాలపట్నం: టీడీపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గోపాలపట్నం స్టేషన్ పరిధిలోని 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్, సింహాచలానికి చెందిన టీడీపీ విశాఖ పార్ల మెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌తో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తులపై వారిని విడుదల చేశారు.
పరవాడ: జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పైలా జగన్నాథరావు, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కన్నూరి వెంకటరమణను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించారు. ఆయా నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాశారు. అలాగే మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడును బుధవారం వేకువజాము నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
లంకెలపాలెం: టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ఆధ్వర్యంలో లంకెలపాలెం కూడలిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అప్పలనాయుడుతో పాటు పలువురిని స్టేషన్‌కు తరలించారు. కాగా బుధవారం వేకువజామునే పలువురు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు పోలీసులు చేరుకుని నిర్బంధించారు. 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్‌ను లంకెలపాలెంలోని ఆయన ఇంట్లో పరవాడ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సాయంత్రం వరకు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
సబ్బవరం: తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌లో పాల్గొనకుండా పలువురు టీడీపీ నేతలను ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పీబీవీఎస్ఎన్ రాజు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొరాడ శ్రీను, బీసీ సెల్ అధ్యక్షుడు అక్కుబాబును ఇరువాడ కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా బుచ్చిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహస్యం అవుతుందని, ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
పెందుర్తి-రూరల్: టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వేకువజామున నాయకులను అరెస్టు చేసిన పెందుర్తి పోలీసులు సాయంత్రం వారిని విడుదల చేశారు. టీడీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావును వేకువజాము నాలుగు గంటల ప్రాంతంలో హౌస్ చేయడంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన ఇంటి వద్దే ఆందోళన చేశారు. టీడీపీ పెందుర్తి కార్యాలయం వద్ద జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బళ్ల శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు కరక దేముడు, సర్పంచ్‌లు గొర్లె రామకృష్ణ, అప్పలరాజు, నాయకురాలు మడక పార్వతిలను ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెందుర్తి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాం వద్ద ఆందోళన చేస్తున్న ‘దేశం’ నాయకులు కోరిబిల్లి సుందరరావు, పీలా జితేంద్ర, వెన్నెల పెంటబాబు, బైలపూడి హరగోపాల్, సత్యనారాయణ, తదితరులను పోలీసులు వాహనాలను ఎక్కించి సేషన్‌కు తరలించారు.
