పెట్రోల్‌ బంక్‌ కూడలిలో పగిలిన తాటిపూడి పైప్‌లైన్‌

ABN , First Publish Date - 2021-10-21T06:16:38+05:30 IST

స్థానిక పెట్రోల్‌ బంక్‌ కూడలిలోని తాటిపూడి పైప్‌లైన్‌పై గల దుకాణాల వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పైపులైన్‌ పగిలిపోవడంతో వుడాకాలనీలోని కొన్ని వీధులు జలమయమయ్యాయి.

పెట్రోల్‌ బంక్‌ కూడలిలో పగిలిన తాటిపూడి పైప్‌లైన్‌
బుధవారం రాత్రి పనులకు సిద్ధమవుతున్న సిబ్బంది

మరమ్మతు పనులు చేపట్టిన సిబ్బంది

గోపాలపట్నం, అక్టోబరు 20: స్థానిక పెట్రోల్‌ బంక్‌ కూడలిలోని తాటిపూడి పైప్‌లైన్‌పై గల దుకాణాల వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పైపులైన్‌ పగిలిపోవడంతో వుడాకాలనీలోని కొన్ని వీధులు జలమయమయ్యాయి. స్థానికులు పైప్‌లైన్‌ లీకేజీపై సంబంధిత కార్యాలయానికి సమాచారం అందించడంతో సుమారు 15 నిమిషాల వ్యవధిలో నీటి ప్రవాహం ఆగింది. కాగా బుధవారం రాత్రి నుంచి లీకేజీ జరిగిన చోట పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపడుతున్నారు.

తరచూ లీకేజీలు

తాటిపూడి పైప్‌లైన్‌ ఎప్పటికప్పుడు లీకేజీలకు గురవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ నుంచి రైతుబజారు వరకు సుమారు 30కి పైగా నిర్మాణాలు తాటిపూడి పైప్‌లైన్‌పైనే  నిర్మించారు. ఈ నిర్మాణాలు నిషేధమైనా స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జీవీఎంసీ అధికారులు లోపాయికారిగా అనుమతులిచ్చారు. గడిచిన మూడేళ్లలో ఇప్పటికి నాలుగుసార్లు పైప్‌లైన్‌ లీకేజీకి గురవ్వడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మాణాలే పైపులైన్‌ లేకేజీకి కారణం!

పైప్‌లైన్‌పై నిర్మాణాల వల్ల పైప్‌లైన్‌ ఒత్తిడికి గురై తరచూ పగిలిపోతుందనడంలో సందేహం లేదు. పైప్‌లైన్‌పై నిర్మాణాలు చేపట్టి సుమారు 13 ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు ఏడెమినిదిసార్లు పైప్‌లైన్లు పగిలిపోయాయి. పెందుర్తి నుంచి గోపాలపట్నం మీదుగా నగరం వైపు వెళుతున్న ఈ పైప్‌లైన్‌ తరచూ గోపాలపట్నం బంక్‌ కూడలి వద్దే పగిలిపోతుండడానికి కారణం ఇక్కడ పైప్‌లైన్‌పై భారీ నిర్మాణాలు ఉండడమే. ఈ క్రమంలో పైప్‌లైన్‌ పగిలిన చోట తవ్వకాలు జరిపి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సింది పోయి పైప్‌లైన్‌పై నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టడంతో తరచూ పైప్‌లైన్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. గతంలో పైప్‌లైన్‌ లీకేజీ వల్ల ప్రవహించిన నీటి ఉధృతికి  వుడాకాలనీ ప్రహరీ కూలిపోయి ఓ కారు ధ్వంసమైన సంగతి తెలిసిందే. అలాగే బీఆర్‌టీఎస్‌కు దిగువ ప్రాంతంలోని ఐదు కాలనీల్లో నీరు చేరింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

రాత్రి వేళ పగిలితే ముప్పే.. 

పైప్‌లైన్‌ ఇప్పటివరకు ఎక్కువసార్లు పగటి పూటే పగిలింది. దీంతో సకాలంలో పైప్‌లైన్‌ నుంచి వచ్చే నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేసేవారు. అదే పైప్‌లైన్‌ అర్ధరాత్రి వేళలో పగిలితే జనాలు తేరుకునేలోగా ప్రమాదం జరగవచ్చు. మరి ఈ సమస్యకు ఏ విధమైన పరిష్కారం లభిస్తుందో వేచి చూడాల్సిందే.!

===


Updated Date - 2021-10-21T06:16:38+05:30 IST