ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-12-08T05:05:43+05:30 IST

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ కింద వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని ఇళ్ల లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి
మహిళకు రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న మంత్రి, తదితరులు

రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

ఆనందపురం, డిసెంబరు 7: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ కింద వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని ఇళ్ల లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటీఎస్‌ ద్వారా లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందించే కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓటీఎస్‌ కింద నిర్ణీత మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించి సంపూర్ణ హక్కు పత్రాలను పొందడం వల్ల రానున్న తరాలకు భరోసాగా ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణ సమయంలో రుణం పొంది ఇప్పటివరకు రూ.లక్షల కొద్దీ అప్పు పేరుకుపోయినా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)తో రూ.పది వేలకే పూర్తి హక్కును ప్రభుత్వం కల్పించడం గర్వించదగ్గ విషయమన్నారు. దీనివల్ల బ్యాంక్‌ రుణాలు పొందాలన్నా, ఇతర అవసరాలకు ఇంటిని అమ్ముకోవాలన్నా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. వైసీపీ నాయకులంతా ఓటీఎస్‌పై విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులంతా ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ (గృహనిర్మాణం) కల్పన మాట్లాడుతూ సంపూర్ణ గృహ హక్కు కోసం రాష్ట్రంలో 1.5 లక్షల మంది, జిల్లాలో 11 వేల మంది, నియోజకవర్గంలో 1,600 మంది లబ్ధిదారులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఓటీఎస్‌ను లబ్ధిదారులంతా వినియోగించుకునేలా అధికారులు, నాయకులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా 60 మంది లబ్ధిదారులకు సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పెంచర్ల కిశోర్‌, జిల్లా రిజిస్ర్టార్‌ మన్మథరావు, ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, డీఈ రంగనాథం, డ్వామా పీడీ విశ్వేశ్వరరావు, నాయకులు మజ్జి వెంకటరావు, పాండ్రంకి శ్రీనివాసరావు, పాండ్రంకి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:05:43+05:30 IST