షుగర్ ఫ్యాక్టరీ గాడిలో పడకపోతే మనుగడ కష్టమే
ABN , First Publish Date - 2021-07-08T06:12:08+05:30 IST
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గాడిలో పడకపోతే మనుగడ చాలా కష్టమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు.

రికవరీ మరీ ఇంత దిగజారిపోతే నష్టం తప్పదు
అధికారులు, కార్మికులదే బాధ్యత: ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం, జూలై 7: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గాడిలో పడకపోతే మనుగడ చాలా కష్టమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిపై ఫ్యాక్టరీ సెక్షన్ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది క్రషింగ్ మరీ ఘోరంగా ఉందని, రికవరీ ఎనిమిది శాతానికి పడిపోవడం ఎన్నడూ లేదని, దీనికి కారణాలు గుర్తించి వచ్చే సీజన్‌లో సరిదిద్దుకోకపోతే ఫ్యాక్టరీ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కటింగ్ ఆర్డర్ల మంజూరులో సైతం ప్రక్షాళన చేపట్టాలని, చెరకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు కటింగ్ పర్మిట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంచదార ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఉప ఉత్పత్తుల ద్వారా ఆదాయం సాధించుకునే మార్గాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, కార్మికులపైనే ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గోవాడ షుగర్స్ ఎండీ వి.సన్యాసినాయుడు, ఏవో రమణమూర్తి, వ్యవసాయాధికారి మల్లికార్జునరెడ్డి, అకౌంట్స్ అధికారి దోహలి, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు రామునాయుడు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
చెరకు బకాయిలపై 13న సీఎంను కలుస్తా
గోవాడ చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.49 కోట్ల బకాయిల విషయమై ఈ నెల 13న సీఎంను కలవనున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రైతుల బకాయిలతో పాటు, కార్మికుల మూడు నెలల వేతనాలు రూ.3.25 కోట్లను గ్రాంటు రూపంలో తీసుకువచ్చేందుకు సీఎంను కలుస్తున్నానని చెప్పారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన పంచదారను ఒకేసారి విక్రయిస్తే ఆప్కాబ్ అప్పు తీరిపోవడంతో పాటు వడ్డీ భారం తప్పుతుందన్నారు. ఈ విషయాన్ని సీఎంకు నివేదిస్తామని ఆయన చెప్పారు. దీనిపై సీఎం స్పందించి పంచదార పౌర సరఫరాల శాఖ ద్వారా, దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల కోసం తీసుకునేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారన్నారు. గోవాడ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలకు మంత్రివర్గ ఉపసంఘం యోచిస్తున్నదన్నారు. అవి అమలులోకి వస్తే గోవాడ పరిస్థితి మెరుగుపడుతుందని ఎమ్మెల్యే వివరించారు.