మురికివాడల్లో సర్వే అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-07-12T06:04:48+05:30 IST

మురికివాడల అభివృద్ధి ప్లాన్‌ తయారీ కోసం జీవీఎంసీ అధికారులు ఆదివారం ప్రారంభించిన సర్వే అస్తవ్యస్తంగా జరిగింది.

మురికివాడల్లో సర్వే అస్తవ్యస్తం
సర్వేను పరిశీలిస్తున్న కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన

డాక్యుమెంట్‌లు అడగడంపై పలువురు నిలదీత

సర్వర్‌ డౌన్‌ కావడంతో పత్రాలు సేకరణ

20 శాతం కూడా పూర్తికాని ప్రక్రియ

విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): మురికివాడల అభివృద్ధి ప్లాన్‌ తయారీ కోసం జీవీఎంసీ అధికారులు ఆదివారం ప్రారంభించిన సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. జీవీఎంసీ పరిధిలోని 793 మురికివాడల్లో  ఒకేసారి సర్వే నిర్వహించేందుకు ఐదు వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వారంతా ఆదివారం ఉదయాన్నే తమకు కేటాయించిన మురికివాడలకు వెళ్లి సర్వే ప్రారంభించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్‌లు, ఇంటి పన్ను పుస్తకం, అవి లేకపోతే కరెంటు బిల్లు, గ్యాస్‌ బిల్లు, రేషన్‌ కార్డు, కుటుంబసభ్యుల ఆధార్‌ కార్డు వివరాలను అడిగి తీసుకున్నారు. వాటన్నింటినీ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసేందుకు ప్రయత్నించగా సర్వర్‌ డౌన్‌ కారణంగా ఆ పని చేయలేకపోయారు. దీంతో పై అధికారులకు విషయాన్ని వివరించడంతో అన్ని వివరాలకు సంబంధించిన పత్రాలు జెరాక్స్‌ కాపీలను అడిగి తీసుకోవాలని, ఇవ్వకపోతే వాటి వివరాలను ఒక పుస్తకంలో నమోదు చేసుకుని తర్వాత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కొంతమంది అయితే సర్వేకి వచ్చినవారికి ఇంటి డాక్యుమెంట్‌లు, పన్ను పుస్తకాలతో ఏం పని అని ప్రశ్నించడం విశేషం. సర్వే తీరుని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన జోన్‌-3, జోన్‌-4 పరిధిలోని మురికివాడలకు వెళ్లి పరిశీలించారు. సర్వే చేసినపుడు వ్యవహరించాల్సిన తీరు, నమోదుచేసే విధానంపై సిబ్బందికి సూచనలిచ్చారు. ఆదివారం సర్వే సందర్భంగా సేకరించిన డాక్యుమెంట్‌లు, వివరాలను సిబ్బంది జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి అప్‌లోడ్‌ చేయించుకున్నారు. సర్వర్‌ మొరాయింపు, అఽధికారులు చెప్పినట్టు లబ్ధిదారుల ఇంటి పత్రాలు, ఇతర వివరాలను అడిగితే మురికివాడల వాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం వంటి కారణాలతో సర్వే 20 శాతం కూడా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. సోమవారం నాటికి సర్వే ప్రక్రియపై ఒక స్పష్టత వస్తుందన్నారు. 


Updated Date - 2021-07-12T06:04:48+05:30 IST