గిరిజన ప్రాంతాల్లో విద్యావ్యవస్థ పటిష్టం

ABN , First Publish Date - 2021-12-19T05:48:01+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో విద్యావ్యవస్థ పటిష్టం
విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న టీడబ్ల్యూ డైరెక్టర్‌ వీరభద్రుడు


మాత,శిశు మరణాల నివారణకు చర్యలు

టీడబ్ల్యూ డైరెక్టర్‌ చినవీరభద్రుడు

చింతపల్లి, డిసెంబరు 18: గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు అన్నారు. శనివారం స్థానిక ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. అలాగే గర్భిణుల వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న సదుపాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం బాలుర ఆశ్రమ పాఠశాల-2, కిటుముల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన  విలేఖర్లతో మాట్లాడారు. మూడు రోజులుగా ఏజెన్సీలోని ఆశ్రమ, ప్రాథమిక, ఈఎంఆర్‌ పాఠశాలలను పరిశీలించినట్టు చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాడేరు గిరిజన సంబరాల్లో ఆదివాసీ విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన ప్రదర్శనలు అసాధారణంగా ఉన్నాయన్నారు.  గిరిజన ప్రాంతాల్లో మాత, శిశు మరణాలు నియంత్రించేందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాతరూడకోటలో సంభవించిన శిశు మరణాలపై ఐటీడీఏ పీవో, పీహెచ్‌సీ వైద్యులతో అధ్యయనం చేశామన్నారు. మరణాలకు గల కారణాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు, ఎంపీడీవో లాలం సీతయ్య, ప్రిన్సిపాల్‌ అన్నామణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:48:01+05:30 IST