మత్స్యగుండంలో కలకలం!

ABN , First Publish Date - 2021-05-20T05:35:48+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మత్యగుండంలో బుధవారం కలకలం రేగింది.

మత్స్యగుండంలో కలకలం!
మత్స్యాలను పూడ్చి పెడుతున్న దృశ్యం

మత్స్యాలపై విష ప్రయోగం
ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు

హుకుంపేట, మే 19:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మత్యగుండంలో బుధవారం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు మత్స్యాలు దర్శనమిచ్చే గుండంలో విష ప్రయోగం చేయడంతో అధిక సంఖ్యలో మత్స్యాలు చనిపోయాయి. మత్స్యగుండంలో బుధవారం కమిటీ ప్రతినిధులు మత్స్యాలను దర్శించుకునేందుకు వెళ్లగా నీటిపై తేలుతున్న మత్య్సాలను చూసి నిర్ఘాంతపోయారు. ఈ ఘటనను సర్పంచ్‌ శాంతికుమారి, గ్రామ పెద్దలకు తెలిపారు. వారు వచ్చి మత్స్యాలను బయటకు తీశారు. ఎవరో విష ప్రయోగం చేయడం వల్లే మృతి చెందాయని, భక్తులు దేవతలుగా ఆరాధించే మత్స్యాలను చంపేయడం దారుణమని వారు వాపోయారు. ఈ ఘటనపై పాడేరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సర్పంచ్‌ శాంతికుమారి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాంగి మత్స్యకొండబాబు, సింహాచలం, పార్వతమ్మ, నాయుడు, రామలింగంపాత్రుడు, గ్రామ పెద్దలు కోరారు. అలాగే దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, మత్స్యగుండంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2021-05-20T05:35:48+05:30 IST