ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యం

ABN , First Publish Date - 2021-12-30T05:55:57+05:30 IST

ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యం
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, డిసెంబరు 29: ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం 321వ రోజు కొనసాగింది. బుధవారం ఈ దీక్షలలో పాల్గొన్న డబ్ల్యూఆర్‌ఎం-1, ఆర్‌ఎస్‌అండ్‌ఆర్‌ఎస్‌, ఎల్‌ఎంఎంఎం కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి పూనుకొన్న బీజేపీకి ప్రజల వద్దకు వచ్చే హక్కు లేదన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం బాలారిష్టాలను తట్టుకొని నేడు 7.3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ సామర్థ్యానికి చేరుకుందని వివరించారు. ఈ కర్మాగారాన్ని ప్రైవేటుకు అప్పగించటం ద్వారా భవిష్యత్తులో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  సత్యనారాయణ, మురళి, నాగబాబు, వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, సూర్యారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T05:55:57+05:30 IST