ఉక్కు జోలికొస్తే పుట్టగతులుండవు

ABN , First Publish Date - 2021-02-08T06:55:20+05:30 IST

విశాఖ ఉక్కును ప్రైవేట్‌టుపరం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నేతలు హెచ్చరించారు.

ఉక్కు జోలికొస్తే పుట్టగతులుండవు
సంఘీభావం తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలి

ఏపీ ఉద్యోగుల సంఘాల హెచ్చరిక 

డాబాగార్డెన్స్‌ , ఫిబ్రవరి 7 : విశాఖ ఉక్కును ప్రైవేట్‌టుపరం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేశారు. డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జీవీఎంసీ గుర్తింపు యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావు, ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు,  ఈపీడీసీఎల్‌ ఫెడరేషన్‌ ఫ్రంట్‌ నాయకుడు పోలాకి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎన్‌ఎంయు నాయకుడు ఆర్‌.శ్రీనివాసరావు, ఆర్టీసీ నాన్‌ ఆపరేషన్‌ నాయకులు నాగరాజు, రెల్లి సత్యంలు మాట్లాడారు. ప్రైవేటీకరణ ఆలోచన మానుకోకపోతే ఎన్డీయే నేతలను ఏపీలోకి అడుపెట్టనీయమని హెచ్చరించారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ తక్షణం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రాజీనామా చేయాలని, రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో చేరాలని డిమాండ్‌ చేశారు.  కేంద్రం సొంతగనులు కేటాయించకుండా విశాఖ ఉక్కును కావాలనే నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు లాభాల బాటలో ఉన్న ఉక్కును నేడు నష్టాల సాకుతో ప్రైవేటీకరించడం తగదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మాభిమాన చిహ్నమని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘ నేతలంతా అభినందిస్తున్నామన్నారు. ప్లాంట్‌ ప్రైవటీకరణ కాకుండా  ముఖ్యమంత్రి చూడాలని కోరారు. అలాగే, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ ఢిల్లీ వెళ్లి ఉద్యమం, స్థానికుల సెంటిమెంట్‌ను అగ్రనాయకులకు వివరించే ప్రయత్నం చేయడం సంతోషకరమన్నారు. అఖిలపక్షాలు చేస్తున్న ఉద్యమానికి తాము పూర్తిగా అండగా ఉంటామన్నారు. భవిష్యత్‌లో ప్రాణత్యాగాలకైనా సిద్ధమని, ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యమని వీరంతా నినదించారు.పాత్రికేయుడు శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. 

 


Updated Date - 2021-02-08T06:55:20+05:30 IST