శ్రావణమాసం చిట్‌ పేరుతో రూ.1.25 కోట్లకు టోకరా

ABN , First Publish Date - 2021-08-28T05:51:15+05:30 IST

శ్రావణమాసం చీటీల పేరుతో మహిళల నుంచి నెలవారీ డబ్బులు కట్టించుకున్న భార్యాభర్తలిద్దరూ రూ.కోటి 25 లక్షలతో పరారయ్యారు.

శ్రావణమాసం చిట్‌ పేరుతో రూ.1.25 కోట్లకు టోకరా
పరారైన చిట్టిబాబు, సుధ (ఫైల్‌ ఫొటో)

శ్రావణమాసం చిట్‌ పేరుతో రూ.1.25 కోట్లకు టోకరా


పరవాడ, ఆగస్టు 27: శ్రావణమాసం చీటీల పేరుతో మహిళల నుంచి నెలవారీ డబ్బులు కట్టించుకున్న భార్యాభర్తలిద్దరూ రూ.కోటి 25 లక్షలతో పరారయ్యారు. దీంతో బాధితులు శుక్రవారం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గల వనపర్తికి చెందిన జలసూత్రం చిట్టిబాబు, సుధ దంపతులు 20 సంవత్సరాల క్రితం వెన్నెలపాలెం వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. చిట్టిబాబు సింహాద్రి ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2004 సంవత్సరం నుంచి హర్షలోహి పేరుతో చిట్టిబాబు, సుధ చిట్‌లు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ అందరితో మంచిగా వుంటూ నమ్మకంగా మెలిగేవారు. శ్రావణమాసం నుంచి మళ్లీ వచ్చే శ్రావణమాసం వరకు నెలవారీ రూ.1000 నుంచి రూ.10 వేల వరకు చీటీలు కట్టించుకునేవారు. పన్నెండు నెలలపాటు రూ.వెయ్యి చొప్పున కట్టిన వారికి రూ.14 వేలు ఇచ్చేవారు. అందరికీ నగదు సకాలంలో చెల్లించడంతో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది శ్రావణమాసం నుంచి ప్రారంభించిన చిట్‌ ఈ ఏడాది శ్రావణమాసం ప్రారంభానికి పూర్తయింది. మొత్తం 150 మంది మహిళల నుంచి సుమారు రూ.కోటి 25 లక్షల వరకూ కట్టించుకున్నారు. ఇలా కట్టించుకున్న నగదును ఈ ఏడాది సభ్యులకు తిరిగిచెల్లించకుండా భార్యాభర్తలు గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 12న పిల్లలతో సహా పరారయ్యారు. ఇంట్లో సామగ్రితో పాటు ద్విచక్ర వాహనాన్ని విడిచిపెట్టేశారు. డ్వాక్రా సంఘం నుంచి సుమారు రూ.3 లక్షల రుణం సుధ తీసుకుంది. వెళ్లే ముందు ఇంటి యజమాని నుంచి రూ.2 లక్షలు తీసుకున్నట్టు చెబుతున్నారు. కూలి పని చేసుకుని కష్టపడి సంపాదించిన డబ్బులతో చీటీలు కట్టామని, తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు. కాగా పరారైన భార్యాభర్తలకు సంబంధించిన బంధువులు కూర్మన్నపాలెంలో ఉన్నారు. వారిని వాకబు చేసినా ఫలితం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-28T05:51:15+05:30 IST