వెంటిలేటర్ల సమస్యకు పరిష్కారం

ABN , First Publish Date - 2021-05-09T04:53:02+05:30 IST

స్థానిక జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్ల సమస్యకు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పరిష్కారం చూపించారు. స్థానిక ఆస్పత్రిలో ఏడాదిగా 25 వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్న దుస్థితిపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిరుపయోగంగా వెంటిలేటర్లు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ తీవ్రంగా స్పందించారు.

వెంటిలేటర్ల సమస్యకు పరిష్కారం
పాడేరు ఆస్పత్రిలో వినియోగానికి సిద్ధం చేసిన వెంటిలేటర్లు

పాడేరు ఆస్పత్రిలో టెక్నిషియన్‌ నియామకం

చొరవ చూపిన ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌...

పాడేరు, మే 8: స్థానిక జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్ల సమస్యకు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పరిష్కారం చూపించారు. స్థానిక ఆస్పత్రిలో ఏడాదిగా 25 వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్న దుస్థితిపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘నిరుపయోగంగా వెంటిలేటర్లు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ తీవ్రంగా స్పందించారు. కేవలం వాటి  నిర్వహణకు టెక్నిషియన్‌ లేని కారణంగా నిరుపయోగంగా ఉండడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనాన్ని చూసిన ఆయన వైద్య విధాన పరిషత్‌ జిల్లా సమన్వయకర్త, స్థానిక జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌లతో  మాట్లాడారు. వెంటిలేటర్లను నిర్వహించే టెక్నిషియన్‌కు నెలకు రూ.20 వేలు వేతనం మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని, కాని రూ.40 వేలు ఇస్తేనే గాని పాడేరులో పనిచేసేందుకు టెక్నిషియన్‌ ఆసక్తి చూపడం లేదని సమస్యను ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌కు వారిద్దరు తెలిపారు. అందుకు స్పందించిన ఐటీడీఏ పీవో టెక్నిషియన్‌కు వైద్య విధానపరిషత్‌ నుంచి రూ.20 ఇస్తే, ఐటీడీఏ నుంచి మరో రూ.20 వేలు వేతనంగా ఇస్తామని, తక్షణమే టెక్నిషియన్‌ నియామకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో శనివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో స్టోర్‌ రూమ్‌లో ప్యాకింగ్‌తో ఉన్న వెంటిలేటర్లు తీసి శుభ్రపరచి, వినియోగానికి సిద్ధం చేశారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్న వెంటిలేటర్ల టెక్నిషియన్‌ మరో మూడు రోజులు విధుల్లో చేరుతారని స్థానిక జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావు ఐటీడీఏ పీవోకు తెలిపారు. పాడేరు ఆస్పత్రిలో ఏడాదిగా నెలకొన్న వెంటిలేటర్ల సమస్య పరిష్కారానికి ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ చొరవ చూపడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-09T04:53:02+05:30 IST