సీలేరు పంపింగ్ పవర్ ప్రాజెక్టుపై స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-10-20T06:49:46+05:30 IST
సీలేరులో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 1,350 మెగావాట్ల సామర్థ్యం గల పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (ఎత్తిపోతల పవర్ ప్రాజెక్టు) ప్రదేశాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ జెన్‌కో కేంద్ర కార్యాలయం నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది.

సీలేరు, అక్టోబరు 19: సీలేరులో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 1,350 మెగావాట్ల సామర్థ్యం గల పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (ఎత్తిపోతల పవర్ ప్రాజెక్టు) ప్రదేశాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ జెన్‌కో కేంద్ర కార్యాలయం నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం వ్యాప్‌కోస్ సంస్థ అందజేసిన సర్వే నివేదిక ఆధారంగా పార్వతీనగర్ వద్ద పంపింగ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ప్రదేశాన్ని సందర్శించింది. ఇది అండర్‌గ్రౌండ్ ప్రాజెక్టు కావడంతో రాక్ నమూనాలను సేకరించిన ప్రదేశాలను తనిఖీ చేసింది. అలాగే జలవిద్యుత్ కేంద్రం నుంచి గుంటవాడ జలాశయంలోకి నీరు విడుదల చేసే పైప్‌లైన్ పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే నిర్మించే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీని కోసం భూమి పైనుంచి భూమి లోపలి భాగంలో ఉండే రాక్ పటిష్ఠం ఎలా ఉందో తెలుసుకోవడానికి శాండికోరి నుంచి పార్వతీనగర్ మీదుగా గుంటవాడ జలాశయం వరకు 66 ప్రదేశాల్లో 60 మీటర్ల నుంచి 140 మీటర్ల లోతులోని రాక్ నమూనాలను వ్యాప్‌కోస్ సంస్థ సేకరించింది. ఆ నివేదికల ఆధారంగా ఆయా ప్రదేశాలను పరిశీలించింది. ఈ ప్రాజెక్టుకు రబ్బర్ డ్యాం ఏ ప్రదేశంలో నిర్మించాలి.. పవర్‌ప్లాంట్ ఎక్కడ నిర్మించాలి.. విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే నీరు గుంటవాడ జలాశయంలోకి ఎలా మళ్లించాలో వ్యాప్‌కోస్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టు ప్రదేశాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మృధుల శ్రీవాత్సవ్, సీనియర్ జియాలిజిస్టు ధర్మేంద్ర కుమార్, వ్యాప్‌కోస్ కన్సల్టెంట్ డీఎస్ మంజ్రేకర్, సీసీఈ రాజు, ఏపీ జెన్‌కో ఎస్‌ఈలు రవీంద్రరెడ్డి సీహెచ్.రామకోటిలింగేశ్వరావు, ఈఈ జాకీర్ హుస్సేన్, ఏడీఈ అప్పలనాయుడు, తదితర్లు పాల్గొన్నారు.