ప్రాంతీయ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్
ABN , First Publish Date - 2021-08-25T05:45:25+05:30 IST
ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ట్రాన్స్‌ఫార్మర్ తీగలు దగ్ధమయ్యాయి.

తీగలు దగ్ధం
చెలరేగిన మంటలు
అప్రమత్తమైన వైద్యుత్, అగ్నిమాపక శాఖల సిబ్బంది
అంధకారం.. ఆందోళనలో ఇన్ పేషెంట్ విభాగం
వేరే లైన్ నుంచి విద్యుత్ పునరుద్ధరణకు ఏర్పాట్లు
నర్సీపట్నం, ఆగస్టు 24 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ట్రాన్స్‌ఫార్మర్ తీగలు దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే ప్రాంతీయ ఆస్పత్రి సిబ్బంది విద్యుత్, అగ్నిమాపక శాఖలకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలను అదుపు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ పాడవ్వలేదని, దానికి సంబంధించిన తీగలు మాత్రమే దగ్ధమయ్యాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రి ప్రాంగణంలో అంధకారం అలముకుంది. పట్టణంలో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏరియా ఆస్పత్రి లైన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. వేరే లైన్ నుంచి విద్యుత్ పునరుద్ధరణకు ఈపీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు దగ్గరలో ఉన్న జనరేటర్ వైర్లు కూడా దగ్ధం కావడంతో అది కూడా మరమ్మతుకు గురైంది. దీంతో ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ విభాగం రోగులు, వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల నీటి సరఫరాకు అవాంతరం ఏర్పడుతుందని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వరకు రోగులు చీకట్లోనే ఉండే పరిస్థితి ఉందని అంటున్నారు.