విస్సన్నపేట భూములపై నిగ్గు తేల్చండి

ABN , First Publish Date - 2021-10-31T06:13:53+05:30 IST

బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో జరుగుతున్న భూ బాగోతంపై తక్షణమే నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

విస్సన్నపేట భూములపై నిగ్గు తేల్చండి
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యేలు పీలా, పల్లా

దేవుడంటే వైసీపీ నేతలకు భయమే లేదు

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ


కశింకోట, అక్టోబరు 30: బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో జరుగుతున్న భూ బాగోతంపై తక్షణమే నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం జమాదులపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిపి విలేకరులతో ఆయన మాట్లాడారు. రంగబోలు గెడ్డకు వెళ్లే వాగులు, గెడ్డలు కప్పేశారని ఆరోపించారు. అలాగే అనుమతులు లేకుండా కొండలను తవ్వి విలువైన గ్రావెల్‌ను వైసీపీ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నారు. ట్రాక్టర్‌ మట్టిని తరలిస్తే కేసులు బనాయించే రెవెన్యూ, పోలీసులు అధికారులు, వందలాది లారీలతో గ్రావెల్‌ను తరలించుకుపోయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ భూముల్లో సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జిరాయతీ భూములు కొనుకుంటే అభ్యంతరం లేదని, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 


దేవుడుపైనా వైసీపీ నేతలకు భయం లేదు

దేవుడుపై కూడా అధికార పార్టీ నాయకులకు భయం లేకుండా పోతోందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ అన్నారు. టీడీపీ హయాంలో పడమటమ్మ లోవను అభివృద్ధి చేశామని, ఇపుడు అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డును కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సుజల స్రవంతి పనులు ప్రారంభమవుతాయని గొప్పలు చెప్పారని, ఇంతవరకు జరగకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు విరమించుకోవాలని పీలా హితవు పలికారు. 


ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియ ఆపండి: మాజీ ఎమ్మెల్యే పల్లా 

ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు, ముఖ్యంగా కిస్ట్రియన్‌ మిషనరీ స్కూళ్లను వైసీపీ ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఈ ప్రక్రియను ఆపాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలలపై ప్రభుత్వం ఇచ్చిన 42, ఇతర అనుబంధ జీవోలను రద్దు చేయాలన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి చేపట్టే కార్యక్రమాల్లో అంతర్యం, మర్మం దాగి ఉంటుందన్నారు. మర్మం ఏమిటంటే జీవోలతో ఎయిడెడ్‌ పాఠశాలలను లాక్కోవాలని ప్రయత్నించారని, వీలు కాకపోవడంతో విలీనం పేరిట లక్షలు, కోట్లు విలువ చేసే ఎయిడెడ్‌ పాఠశాలలను చేజిక్కించుకోవడానికి పూనుకున్నారని విమర్శించారు. ఈ విధానాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  పోలవరం, సుజల స్రవంతి పనులు తక్షణమే పూర్తిచేయాలని లపల్లా డిమాండ్‌ చేశారు. రాషా్ట్రన్ని తాకట్టు పెట్టి సంక్షేమం చేద్దామనే ఆలోచనను సీఎం విరమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి కోట్ని బాలాజీ, టీడీపీ మండల నాయకులు కాయల మురళీధర్‌, ఉగ్గిన రమణమూర్తి, వేగి గోపికృష్ణ, ఒమ్మి సత్యనారాయణ, బుదిరెడ్డి గంగయ్య, ఒమ్మి కొటేశ్వరరావు, కరక రాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T06:13:53+05:30 IST