ఒక్కరూ ప్రాతినిధ్యంలేని చోట రాష్ట్ర స్థాయి పోటీలా

ABN , First Publish Date - 2021-02-27T04:42:42+05:30 IST

32వ రాష్ట్ర స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ (ఆర్టిస్టిక్‌) చాంపియన్‌షిప్‌ టోర్నీని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించడం ఆందోళనకరంగా వుందని స్కేటర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కరూ ప్రాతినిధ్యంలేని చోట రాష్ట్ర స్థాయి పోటీలా

రాజమండ్రిలో స్కేటింగ్‌ టోర్నీ నిర్వహణపై తల్లిదండ్రుల అభ్యంతరం

అన్ని సదుపాయాలున్నందున విశాఖలో నిర్వహించాలని లేఖ

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 26: 32వ రాష్ట్ర స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ (ఆర్టిస్టిక్‌) చాంపియన్‌షిప్‌ టోర్నీని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించడం ఆందోళనకరంగా వుందని స్కేటర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో స్కేటర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోటీల వేదికను విశాఖకు మార్చాలని కోరుతూ రాష్ట్ర, జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ ప్రతినిధులకు స్కేటర్ల తల్లిదండ్రులు లేఖ రాసారు.


విశాఖ నుంచి అత్యధికంగా 88 మంది, విజయవాడ నుంచి 13 మంది స్కేటర్లు ఈ పోటీల్లో పాల్గొంటుండగా, రాజమండ్రి నుంచి ఒక్కరు కూడా లేరని ఆ లేఖలో పేర్కొన్నారు. పైగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో టోర్నీని నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. అంతేకాకుండా ఆర్టిస్టిక్‌ ఈవెంట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్న వారిలో  57 మంది స్కేటర్లు పదకొండు ఏళ్లలోపు వారేనని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర స్కేటింగ్‌ సంఘంపై ఉందన్నారు.


గత ఏడాది విశాఖలో జరిగిన జాతీయ స్థాయి టోర్నీ నిమిత్తం కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఆఽధునిక రింక్‌లు, ట్రాక్‌ అందుబాటులో ఉన్నా యన్నారు. స్కేటింగ్‌ క్రీడను రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేయాలన్న తపనతో రాజమండ్రిలో ఈవెంట్‌ నిర్వహించాలని అనుకోవడం తప్పుకాకున్నా, ప్రస్తుతం సరైన సమయం కాదన్నారు. పైగా ప్రైవేటు స్కూల్‌లోని రింక్‌లో పోటీలకు అనుమతివ్వడం సరికాదని, అంతేకాకుండా సరైన రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో పోటీలను నిర్వహిస్తే స్కేటర్లు ఇబ్బందులు పడతారని  తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కోవిడ్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ సంఘం ప్రతినిధులు పునరాలోచించి వేదికను రాజమండ్రి నుంచి విశాఖకు మార్చాలని కోరారు. 

Updated Date - 2021-02-27T04:42:42+05:30 IST