పంచాయతీ నిధులు మళ్లింపుపై సర్పంచ్‌ల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-23T06:08:04+05:30 IST

పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడాన్ని మండల సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పంచాయతీ నిధులు మళ్లింపుపై సర్పంచ్‌ల ఆందోళన
పాడేరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న మండల సర్పంచ్‌లు

పాడేరురూరల్‌, నవంబరు 22: పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడాన్ని మండల సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక గిరిజన ఉద్యోగుల సంఘం భవన్‌లో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వనుగు బసవన్నదొర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సర్పంచ్‌లు మాట్లాడారు. 14, 15వ ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందన్నారు. పంచాయతీల నిధులు మళ్లిస్తే అభివృద్ధి ఎలా చేస్తామని వారు ప్రశ్నించారు. ఇప్పటికే పంచాయతీల్లో తిరగలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇప్పటికైనా ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు తిరిగి జమ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ల ఫోరం నాయకులు సీదరి రాంబాబు, వంతాల రాంబాబు, పాంగి రాంబాబు, గబ్బాడ చిట్టిబాబు, సీతమ్మ, పార్వతమ్మ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

అనంతగిరి: పంచాయతీ నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ సర్పంచ్‌లు సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకుండా ఫ్రీజింగ్‌ విఽధించి, ఆ నిధులను ప్రభుత్వం మళ్లించడం తగదన్నారు. వెంటనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో సర్పంచ్‌లు జన్ని అప్పారావు, సింహాద్రి, మొస్య, రూతు పాల్గొన్నారు. 

ముంచంగిపుట్టు: ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం సర్పంచ్‌లు ఆందోళన చేశారు. పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్‌, మళ్లింపుతో ఎటువంటి అభివృద్ధి కార్యక్ర మాన్ని చేపట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఆ నిధులను పంచాయతీల ఖాతాలో జమ చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం, కించాయిపుట్టు, వనభసింగి  సర్పంచ్‌లు కె.త్రినాథ్‌, ఎస్‌. సుభాశ్‌, వి. లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

జి.మాడుగుల: పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్‌లకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్‌.రామకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిం దన్నారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నిధులను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎస్‌.కొండబాబు, కె.రాంబాబు, ఐ.హనుమంతరావు, పి.కృష్ణమూర్తి, మాలన్న, గంగరాజు, సత్యనారాయణ, బొంజుబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:08:04+05:30 IST