సర్కారు భూమికి ఎసరు

ABN , First Publish Date - 2021-12-31T06:14:26+05:30 IST

అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఒకే సర్వే నంబరులో వున్న 95.44 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డుల్లో జిరాయితీగా మార్చేశారు. సబ్‌ డివిజన్‌ చేసి సుమారు వంద మంది రైతుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేశారు.

సర్కారు భూమికి ఎసరు

రోలుగుంట మండలంలో 95.44 ఎకరాలు అన్యాక్రాంతం

అధికార పార్టీ నేత, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు

రికార్డులు తారుమారు... వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీగా నమోదు

సుమారు వంద మంది సాగుదారుల పేర్లతో ఆన్‌లైన్‌

రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు

అనంతరం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో మిలాఖత్‌

రైతులు కారుచౌకగా భూములు విక్రయించేలా చక్రం తిప్పిన నాయకుడు

స.హ. చట్టం ద్వారా వెలుగుచూసిన బాగోతం


రోలుగుంట, డిసెంబరు 30:

అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఒకే సర్వే నంబరులో వున్న 95.44 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డుల్లో జిరాయితీగా మార్చేశారు. సబ్‌ డివిజన్‌ చేసి సుమారు వంద మంది రైతుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేశారు. తరువాత పలువురు రైతులకు కొద్దిమొత్తం ఇచ్చి, సుమారు 60 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో భారీమొత్తంలో డబ్బులు చేతులు మారాయి. రోలుగుంట మండలం నిండుగొండ రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ కుంభకోణంపై మునిపల్లి గ్రామానికి చెందిన శానాపతి సత్యనారాయణ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా  సేకరించిన వివరాలిలా ఉన్నాయి. 

రోలుగుంట మండలం నిండుగొండ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 320లో 95.44 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. పక్కనే వున్న ఎన్‌.కొత్తూరు, మునిపల్లి, గొల్లపేట, రాజుపేట గ్రామాల రైతులు ఈ భూముల్లో పశువులు, గొర్రెలను మేపుకొనేవారు. కొంతకాలం తరువాత అర ఎకరా, ఎకరా చొప్పున బాగుచేసు కుని కాయగూరలను పండించుకోవడం మొదలు పెట్టారు. ఎవరికీ హక్కు పత్రాలు లేవు. రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌ (వెబ్‌ల్యాండ్‌) అయ్యే వరకు ప్రభుత్వ పోరంబోకు భూమిగానే ఉండేది. సుమా రు పదేళ్ల క్రితం ఎన్‌.కొత్తూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడి (అప్పట్లో కాంగ్రెస్‌ నేత. ప్రస్తుతం వైసీపీలో కీలక పదవిలో వున్నారు) కన్ను ఈ భూములపై పడింది. రెవెన్యూ అధికా రులతో కలిసి స్కెచ్‌ గీశారు. సాగు చేసుకుం టున్న భూములకు హక్కు పత్రాలు ఇప్పిస్తానని చెప్పి రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమొత్తాన్ని రెవెన్యూ అధికారులకు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి    కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. సర్వే నంబరు 320లో వున్న 95.44 ఎకరాలను జిరాయితీగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. అంతేకాక 1, 1ఏ, 1బీ, 1సీ....1జడ్‌, అలాగే 2ఏ, 2బీ.... ఇలా సబ్‌ డివిజన్‌ చేసి, దాదాపు 100 మంది రైతుల పేర్లమీద ఆన్‌లైన్‌ చేశారు.

చేతులు మారిన 60 ఎకరాలు

ప్రభుత్వ పోరంబోకు భూమిని జిరాయితీగా మార్పించడంలో కీలకంగా వ్యవహరించిన సదరు నాయకుడు..నర్సీపట్నం, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఇక్కడ భూములు కొనుగోలు చేయించాడు. వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదైన రైతుల్లో కొంతమందిని నయానో భయానో లొంగదీసుకుని, ఎకరా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలకు విక్రయించేలా ఒత్తిడి చేశాడు. ఈ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కొనుగోలు చేయించి, భారీ మొత్తాన్ని ప్రతిఫలంగా తీసుకున్నట్టు తెలిసింది. సుమారు 60 ఎకరాల వరకు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారమంతా నాలుగైదేళ్ల క్రితం జరిగినట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఎకరా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతున్నది.  

లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తా

ఎస్‌.సత్యనారాయణ, మునిపల్లి(30ఆర్‌ల్‌జి   4)

నిండుగొండ సర్వే నంబరు 320లో వున్న 95.44 ఎకరాలు 1913లో బ్రిటీష్‌ అధికారులు తయారుచేసిన డైగ్లాట్‌లో ప్రభుత్వ పోరంబోకు భూమిగా నమోదై ఉంది. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా డైగ్లాట్‌ను మార్చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కూడా మార్పులు చేసి తప్పుడు రికార్డులు తయారుచేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా కలెక్టరేట్‌, సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి ఈ సమాచారం తీసుకున్నాను. ఈ వ్యవహారంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాను.

స.హ. చట్టం ద్వారా వెలుగులోకి....

నిండుగొండ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీగా నమోదైన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మునిపల్లి గ్రామానికి చెందిన శానాపతి సత్యనారాయణ (ఇతను కూడా అధికార పార్టీ నాయకుడే) గత ఏడాది సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా అధికారులు సమాచారం ఇవ్వలేదు. పదే పదే దరఖాస్తు చేయడంతో ఎట్టకేలకు వివరాలు అందజేశారు. ఆ వెంటనే భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ర్టేషన్లు జరగకుండా ‘రెడ్‌ మార్కు’లో పెట్టారు.


క్రయవిక్రయాలు జరగకుండా ‘డిస్‌ప్యూట్‌’లో పెట్టాం

ఆర్‌.గోవిందరావు, ఆర్డీఓ, నర్సీపట్నం

నిండుగొండ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 320లో వున్న భూమికి సంబంధించి క్రయవిక్రయాలు జరగకుండా వెబ్‌ల్యాండ్‌లో ‘డిస్‌ప్యూట్‌’లో పెట్టాం. దీనికి సంబంధించి స్పందనలో కూడా ఫిర్యాదులు అందాయి. సమగ్ర పరిశీలన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం.

Updated Date - 2021-12-31T06:14:26+05:30 IST