అప్పన్న స్వామికి సహస్ర నామార్చన
ABN , First Publish Date - 2021-11-03T05:59:27+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు.
సింహాచలం, నవంబరు 2: వరాహలక్ష్మీనృసింహస్వామికి మంగళవారం సంప్రదాయబద్ధంగా సహస్రనామార్చన జరిపారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవల్లో భాగంగా మంగళవారం ప్రభాత సేవల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలో ఉంచి పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి షోడశోపచారాలు సమర్పించారు. తర్వాత నృసింహ సహస్రనామావళి చదువుతూ అర్చకులు పవిత్రమైన తులసీదళాలతో వైభవంగా పూజలు చేశారు. అనంతరం ఇదే వేదికపై స్వామివారి నిత్య కళ్యాణాన్ని జరిపారు. ఆయా సేవల్లో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, అధికారులు అందజేశారు.
రేపు అప్పన్న స్వామి దర్శనాలు సాయంత్రం 6గంటల వరకే..
దీపావళి పండుగ సందర్భంగా ఏటా మాదిరిగానే ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సింహాద్రి అప్పన్న స్వామి దర్శనాలు భక్తులకు లభిస్తాయని దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆరు గంటలకు భక్తులకు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తామని, రాత్రి ఆరాధన, తిరువీధి ఉత్సవం జరిపాక ఏకాంతసేవ, కవాట బంధనంతో ఆలయాన్ని మూసివేస్తామన్నారు. తిరిగి ఆ మర్నాడు ఉదయం ఆరున్నర నుంచి భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు యథావిధిగా లభిస్తాయని పేర్కొన్నారు.