కనక మహాలక్ష్మికి సహస్ర ఘటాభిషేకం
ABN , First Publish Date - 2021-12-31T05:56:13+05:30 IST
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు.

మార్గశిరమాసోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహణ
అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
విశాఖపట్నం, డిసెంబరు 30: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ చైర్మన్, ట్రస్టీ సభ్యులు, ఆలయ ఈవో దంపతుల చేతులు మీదుగా తొలుత అభిషేకం నిర్వహించారు.
బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత తొలిపూజ నిర్వహించి అమ్మవారికి పసుపుకుంకుమ నీళ్లతో అభిషేకం నిర్వహించారు. క్షీరాభిషేకం తర్వాత పసుపు కుంకుమరాసి స్వర్ణాభరణాలంకరణ చేశారు. అమ్మవారిని కలువపూలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం వీధి కిటకిటలాడింది. రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని క్షీరాభిషేకం నిర్వహించారు.
ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్, తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, పలువురు నాయకులు, ఉభయ దాతలు అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ సిస్టమ్ కోసం బొడ్డేటి కాశీవిశ్వనాథం రూ.లక్ష విరాళం చెక్కును ఆలయ ఈవోకు అందించారు.