ఏజెన్సీలో అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం

ABN , First Publish Date - 2021-08-03T05:58:25+05:30 IST

ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు రహదారి సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు.

ఏజెన్సీలో అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం

మాతా శిశుమరణాల నియంత్రణపై దృష్టి

పాడేరు ఆస్పత్రిలో సేవలు మెరుగుపరుస్తాం

కరోనా కేసులు పెరగకుండా పటిష్ఠ చర్యలు 

జిల్లాకు లక్ష డోసుల వ్యాక్సిన్‌

కళాశాలల విద్యార్థులకు టీకా వేసేందుకు చర్యలు

కలెక్టర్‌ మల్లికార్జున


విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు రహదారి సదుపాయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏఏ గ్రామాలకు రహదారి సదుపాయం ఉంది?, ఇంకా ఎక్కడెక్కడా నిర్మాణం చేపట్టాలో...మ్యాపింగ్‌ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో మారుమూల గ్రామాలకు రోడ్లు వేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు అనే కాకుండా కనీసం వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వుండేలా రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం ఒక ప్రణాళిక రూపొందించి మూడు,నాలుగేళ్లలో అమలుకు యత్నిస్తామని చెప్పారు. ఏజెన్సీలో మాతా, శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ఇందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గర్భిణులకు సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రసవాలకు తీసుకువచ్చే ఫీడర్‌ అంబులెన్స్‌ల సేవలపై దృష్టిసారించామన్నారు. జిల్లాకు మరిన్ని ఫీడర్‌ అంబులెన్స్‌లు రానున్నాయని తెలిపారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు వుండేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితులపై ఈ వారంలో ఐటీడీఏలో సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలను సీఎస్‌ఆర్‌ కింద దత్తత తీసుకుని అభివృద్ధి చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలోని పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల సీఎస్‌ఆర్‌ నిధులతో గిరిజన గ్రామాల్లో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


కొవిడ్‌ కేసులు పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. నగరంలో బీచ్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనన్నారు. మాల్స్‌, దుకాణాల్లో మాస్క్‌ తప్పనిసరి అని అన్నారు. ఈ నెల 16 నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నందున, అందుకనుగుణంగా విద్యా శాఖను సన్నద్ధం చేయనున్నట్టు చెప్పారు. కళాశాలలకు వచ్చే విద్యార్థులకు కొవిడ్‌ టీకా వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 45 ఏళ్లపైబడిన వారిలో 85 శాతం మందికి టీకా వేశామని, మిగిలిన వారికి మూడు, నాలుగు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఆ తరువాత 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి టీకాలు వేస్తామన్నారు. ప్రస్తుతం లక్ష టీకా డోసులు జిల్లాకు వచ్చాయని కలెక్టర్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-08-03T05:58:25+05:30 IST