ఎక్సైజ్‌లో అద్దె వాహనాలు బంద్‌

ABN , First Publish Date - 2021-01-12T05:51:44+05:30 IST

జిల్లాలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలోని అద్దె వాహనాలు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి.

ఎక్సైజ్‌లో అద్దె వాహనాలు బంద్‌

ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు

వాహనాల డ్రైవర్‌ల సంఘం ప్రతినిధుల నోటీస్‌

16 నెలలుగా అందని అద్దె బిల్లులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలోని అద్దె వాహనాలు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. గత 16 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో వాహనాలను నిలిపివేయాలని యజమానులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు సోమవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం ప్రతినిధులు నోటీసు అందజేశారు. దీంతో మంగళవారం నుంచి విధులకు ఎలా హాజరుకావాలా అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులు విధి నిర్వహణ కోసం 34 బొలేరో వాహనాలను అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం టెండర్లు పిలిచింది. ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేలు చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. దీంతో ప్రైవేటు వాహనాల యజమానులు పలువురు తమ వాహనాలను ఎక్సైజ్‌ శాఖకు అద్దెకు ఇచ్చారు. ఎక్సైజ్‌ అధికారులు విధి నిర్వహణలో భాగంగా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు, పట్టుబడిన నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు, మద్యం, నాటుసారా, గంజాయి వంటి వాటిపై దాడులకు వెళ్లినప్పుడు ఈ వాహనాలను వినియోగిస్తుంటారు. టీడీపీ హయాంలో బిల్లులు సక్రమంగా చెల్లించినప్పటికీ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. అద్దె వాహనాల కోసం ఎక్సైజ్‌ శాఖ బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి వున్నప్పటికీ ఆ పని చేయలేదు. దీంతో గత 16 నెలలుగా వాహనాలకు అద్దె చెల్లింపులు జరగలేదు. దీనిపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వాహనాల నిర్వాహకులు తెలియజేశారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ సీఎం జగన్‌కు కూడా లేఖలు రాశామని, అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు డ్రైవర్ల సంఘం ప్రతినిధులు తేల్చిచెప్పారు. తాము వాహనాలను రుణంపై తీసుకున్నామని, వాయిదాలను సకాలంలో కట్టకపోతే సీజ్‌ చేస్తామని ఫైనాన్స్‌ సంస్థలు హెచ్చరించడంతో బంగారం, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టి చెల్లించుకుంటూ వచ్చామన్నారు. డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరిపోవడంతో గత్యంతరం లేక బిల్లులు చెల్లించేంత వరకూ వాహనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సంఘం ప్రతినిధులు టి.రమేష్‌, ఏ.సత్తిబాబు తదితరులు నోటీసులో పేర్కొన్నారు.

Updated Date - 2021-01-12T05:51:44+05:30 IST