అన్నదాతకు ఊరట!

ABN , First Publish Date - 2021-05-21T04:45:10+05:30 IST

ఎరువు ‘ధర’వు నుంచి అన్నదాతకు కాస్త ఉపశమనం లభించింది. డీఏపీపై కంపెనీలు పెంచిన ధరను రాయితీగా భరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఊరటనిచ్చింది.

అన్నదాతకు ఊరట!
డీఏపీ ఎరువులు

పాత ధరకే డీఏపీ

బస్తా రూ.1200గానే నిర్ణయం 

కంపెనీ పెంచిన రూ.700 రాయితీగా  భరిస్తామని కేంద్రం ప్రకటన

ఊపిరి పీల్చుకున్న రైతులు

రాయితీ ఎత్తేస్తే కథ మామూలే


చోడవరం, మే 20: ఎరువు ‘ధర’వు నుంచి అన్నదాతకు కాస్త ఉపశమనం లభించింది. డీఏపీపై కంపెనీలు పెంచిన ధరను రాయితీగా భరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఊరటనిచ్చింది. జిల్లాలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం లక్షా 98 వేల 979 హెక్టార్లు. ఇందులో ప్రధాన పంటలు వరి 1.01 లక్షల హెక్టార్లలోను, చెరకు 37,241, రాగి 21,672, సజ్జ 3,372, జొన్న 514, మొక్కజొన్న 5,878, కంది 2004, సెపర 982 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీటికి యూరియా తరువాత ఎక్కువగా ఉపయోగించే ఎరువు డీఏపీనే. ఇప్పటికే డీఏపీ బస్తా ధర రూ.1200 ఉంది. ఇది రైతులకు భారమే అయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా గత నెల 8న డీఏపీ బస్తాపై ఎరువుల కంపెనీ ఒకేసారి రూ.700 పెంచి...రూ.1900 చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అన్నదాతల నెత్తిన పిడుగుపడినట్టయింది. ఇప్పటికే విపత్తుల కారణంగా పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఇక వ్యవసాయం చేయడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చారు.  


కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఊపిరి


ఎరువుల కంపెనీ డీఏపీ బస్తాపై పెంచిన ధరను భరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో రైతులకు ఊపిరిపీల్చుకున్నారు. డీఏపీపై పెంచిన రూ.700 భారాన్ని రాయితీగా ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పెంపు భారాన్ని కేంద్రం భరించినంత వరకే రైతులకు ఉపశమనం లభిస్తుంది. మన్ము రాయితీ ఇవ్వలేమని కేంద్రం తప్పుకుంటే మళ్లీ రైతుల నెత్తిన భారం పడే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి డీఏపీ బస్తా పాత ధర ప్రకారం రూ.1200కే లభించడం అన్నదాతకు ఊరటనిచ్చేదిగానే చెప్పవచ్చు.


ధర తగ్గించడం సంతోషమే

సయ్యపురెడ్డి వెంకటరావు, రైతు, వ డ్డాది, బుచ్చెయ్యపేట


డీఏపీ ధరను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆనందించదగిందే. బస్తాకు రూ.700 పెంచడంతో ఈ సీజన్‌లో డీఏపీ కొనడం కష్టమే అనుకున్నాం. ఈ సమయంలో పాత ధరకే డీఏపీ అందుబాటులో వుంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సంతోషకరం.

Updated Date - 2021-05-21T04:45:10+05:30 IST