ఎరక్క పోయి... ఇరుక్కుపోయామా?

ABN , First Publish Date - 2021-03-14T05:50:58+05:30 IST

‘ఆ చేత్తో పెట్టు...ఈ చేత్తో లాక్కో...’ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం వున్నదని రేషన్‌ పంపిణీ చేసే మినీ వ్యాన్‌ల యజ మానులు వాపోతున్నారు.

ఎరక్క పోయి... ఇరుక్కుపోయామా?

అయోమయంలో రేషన్‌ పంపిణీ

వ్యాన్‌ల యజమానులు రూ.21,000 గౌరవ వేతనంగా ప్రకటించిన ప్రభుత్వం

తీరా అకౌంట్లలో పడ్డాక రూ.12,900 బ్లాక్‌

సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు చూసి అవాక్కు

అదేమిటో తేలేంతవరకూ సరకుల పంపిణీ చేయబోమన్న మాకవరపాలెం మండలంలోని వ్యాన్‌ యజమానులు


మాకవరపాలెం, మార్చి 13: ‘ఆ చేత్తో పెట్టు...ఈ చేత్తో లాక్కో...’ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం వున్నదని రేషన్‌ పంపిణీ చేసే మినీ వ్యాన్‌ల యజ మానులు వాపోతున్నారు.ఆ చేత్తో పెట్టు...ఈ చేత్తో లాక్కో...’ అన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం వున్నదని రేషన్‌ పంపిణీ చేసే మినీ వ్యాన్‌ల యజ మానులు వాపోతున్నారు. ఉపాధి లేక అష్టకష్టాలు పడినవారంతా రాష్ట్ర ప్రభుత్వం తొలుత వ్యాన్‌లు మంజూరుచేయడంతో జీవనోపాధి దొరికిందని సంబ రపడ్డారు. తీరా విధుల్లో చేరిన నాటి నుంచి వరుస కష్టాలు వెంటాడుతుండడంతో రెండు మాసాల్లోనే మాకొద్దు బాబోయ్‌.. ఈ బండి...అని చేతులెత్తేస్తు న్నారు. వీరి వేదనకు గల కారణాలు ఇలా ఉన్నాయి. 


మాకవరపాలెం

 మండలంలో ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ నిమిత్తం 14 మినీ ట్రక్కులను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటి కోసం చాలా మంది నిరుద్యోగులు పోటీ పడ్డారు. చివరకు కొందరు ఈ వాహనాలను దక్కించుకున్నారు. ఇందుకు ఒక్కొక్కరు అప్పు చేసి మరీ రూ.65 వేలు చొప్పున డిపాజిట్‌ చేశారు. తొలుత వీరికి రూ.16,000 గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఫిబ్రవరి నెలలో విధుల్లో చేరాక చేసిన పనికి...వచ్చే గౌరవ వేతనం గిట్టుబాటు కాదని అంతా ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం  మరో రూ.5000లను పెంచింది. దీంతో ఒక్కొక్కరూ తమకు నెలకు రూ.21,000 వేలు చొప్పున అందుతుందని సంబరపడ్డారు. మొదటి నెల గౌరవ వేతనం రూ.21 వేలు చొప్పున ఈ నెల పదో తేదీన అందరికీ బ్యాంకు ఆఫ్‌ బరోడాలోని వారి వారి అకౌంట్లలో జమ అయ్యింది. అయితే ఆ తరువాత వస్తున్న మెసేజ్‌లు చూసి వీరిలో కలవరం మొదలైంది. తొలుత శుక్రవారం అకౌంట్‌ నుంచి రూ.4 వేలు బ్లాక్‌ చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రతించగా...రూ.3 వేలు వ్యాన్‌ ఫైనాన్స్‌కి, మరో వెయ్యి రూపాయలు బ్యాంకు తొలి నెల సర్వీసు చార్జీ కింద మినహాయించుకుంటున్నట్టు బదులిచ్చారు. మళ్లీ శనివారం ఉదయం రూ.8,900 బ్లాక్‌ చేసినట్టు వీరి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ రావడంతో అంతా నిర్ఘాంతపోయారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. మినీ ట్రక్కు యజమానులంతా సమావేశమయ్యారు. ఇలాగైతే రేషన్‌ బియ్యం పంపిణీ ఇక తమ వల్ల కాదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా శనివారం మండలంలోని 14 మినీ ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో తమకు స్పష్టమైన సమాచారం వచ్చేంత వరకు బియ్యం పంపిణీ చేయరాదంటూ సమావేశంలో అంతా తీర్మానించుకున్నారు. ఇదిలావుంటే వాహన యజమానుల అకౌంట్లలో నగదు బ్లాక్‌ చేయడంపై బ్యాంకు అధికారులను శనివారం సీఎస్‌డీటీ సంప్రతించారు. నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని, ఆ తరువాత చూస్తామని బదులిచ్చినట్టు సీఎస్‌డీటీ చెప్పారు. 


రూ. 8,900 ఎందుకు బ్లాక్‌ చేశారో తెలియదు   

మాకవరపాలెం తహసీల్దార్‌ రాణి అమ్మాజీ వద్ద మినీ వ్యాన్‌ యజమానుల సమస్యను ప్రస్తావించగా, శనివారం రూ.8,900 ఎందుకు బ్లాక్‌ చేశారో తెలియదని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళతానని చెప్పారు.  

Updated Date - 2021-03-14T05:50:58+05:30 IST