ఇంటికి చేరని రేషన్‌

ABN , First Publish Date - 2021-02-26T05:43:38+05:30 IST

ఏజెన్సీలో రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. బియ్యం కార్డుదారులు ప్రతి నెలా 15వ తేదీకల్లా తమ పరిధిలోని జీసీసీ డీఆర్‌ డిపో నుంచి రేషన్‌ తీసుకునేవారు.

ఇంటికి చేరని రేషన్‌
జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ మద్దివీధి

మన్యంలో అస్తవ్యస్తంగా సరకుల పంపిణీ 

ఇంతవరకు 40 శాతం కార్డుదారులకు కూడా అందని వైనం

మారుమూల గ్రామాలకు వెళ్లని మినీ వ్యాన్లు

రోడ్డు పాయింట్‌కు వచ్చి రేషన్‌ తీసుకోవాలని కార్డుదారులకు సమాచారం

పనులు మానుకునివేచిఉండాల్సిన పరిస్థితి

పాత పద్ధతిలోనే రేషన్‌ పంపిణీ చేయాలంటున్న ఆదివాసీలు 


పాడేరు, ఫిబ్రవరి 25: 

ఏజెన్సీలో రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. బియ్యం కార్డుదారులు ప్రతి నెలా 15వ తేదీకల్లా తమ పరిధిలోని జీసీసీ డీఆర్‌ డిపో నుంచి రేషన్‌ తీసుకునేవారు. కానీ ఈ నెలలో 25 రోజులు గడిచినా ఇంతవరకు 40 శాతం కార్డుదారులకు కూడా కోటా సరకులు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానమే ఇందుకు కారణమని గిరిజనులు వాపోతున్నారు. 

ఏజెన్సీలోని 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,754 గ్రామాలు ఉన్నాయి. ప్రతి నెలా లక్షా 63 వేల 650 కుటుంబాలకు 486 రేషన్‌ డిపోల (జీసీసీ డీఆర్‌ డిపోలు) ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు వంటి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుంటారు. రేషన్‌ సరఫరాను ఒకటో తేదీన ప్రారంభించి 15వ తేదీతో ముగిస్తుంటారు. గిరిజనులు తమకు వీలైన రోజున సమీపంలో వున్న డీఆర్‌ డిపోనకు వెళ్లి సరకులు తెచ్చుకుంటుంటారు. దీంతో అత్యంత మారుమూల గ్రామాల వారికి సైతం రేషన్‌ సక్రమంగా అందు తున్నది. గత నెల వరకు ఇదే విధానం అమలైంది. అయితే కార్డుదారుల ఇళ్ల వద్దనే సరకులు అందిం చాలన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం 144 మినీ వ్యాన్లను మంజూరుచేసింది. ప్రతి వాహ నానికి డ్రైవర్‌తోపాటు, ఒక సహాయకుడు ఉన్నారు. రోజూ 50కిపైబడి కార్డులకు రేషన్‌ ఇవ్వాలి. ఏరోజుకారోజు సంబంధిత జీసీసీ డీఆర్‌ డిపో నుంచి సరకులు విడిపించి, కార్డుదారులకు పంపిణీ చేయాలి. ఏ గ్రామంలో...ఏ తేదీన రేషన్‌ పంపిణీ చేస్తారో రెండు,మూడు రోజుల ముందే సంబంధిత వలంటీరు సమాచారాన్ని అందిం చాలి. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ... ఆచరణలోకి వచ్చేసరికి రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది.


40 శాతం కూడా పూర్తికాని రేషన్‌ పంపిణీ

ఫిబ్రవరిలో ఇంతవరకు 40 శాతం కార్డులకు కూడా రేషన్‌ పంపిణీ కాలేదు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్‌ పంపిణీ వ్యాన్లపై అధికార పార్టీ జెండాలోని రంగులు వున్నాయని, వాటిని తొలగించిన తరువాతే రేషన్‌ పంపిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీచేయడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంతో గ్రామీణ ప్రాంతంలో ఈ నెల ఒకటో తేదీన రేషన్‌ పంపిణీ ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ జరిపిన అనంతరం వ్యాన్ల ద్వారా రేషన్‌ పంపిణీ చేయవచ్చంటూ 15వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆ మరుసటిరోజు నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభం అయ్యింది. కానీ ఇంతవరకు 50 నుంచి 60 వేల కార్డులకు మాత్రమే రేషన్‌ అందినట్టు సమాచారం.  


గ్రామ శివార్లలోనే రేషన్‌ పంపిణీ

ఏజెన్సీలో పలు గ్రామాలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో వుండడం, రహదారి సదుపాయం లేకపోవడం, రేషన్‌ పంపిణీ వ్యాన్లు ఎత్తు ప్రదేశాల్లో మొరా యిస్తుండడంతో గ్రామాలకు శివార్లలోనే వాహనాలను ఆపేస్తున్నారు. కార్డుదారులు అక్కడకే వచ్చి సరకులు తీసుకువెళ్లాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల గ్రామానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వ్యాన్‌ను నిలుపుదల చేసి, రేషన్‌ కోసం అక్కడకు రమ్మంటున్నా రని జి.మాడుగుల మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజనులు ఆవేదనతో చెప్పారు. ఒకరోజు కూలి పనులు మానుకుని బియ్యం కోసం వ్యాన్‌ వద్దకు వెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గతంలో అయితే తమకు వెసులుబాటు వున్న రోజున డీఆర్‌ డిపోనకు వెళ్లి రేషన్‌ తెచ్చుకునేవారమని, కొత్త విధానంలో ఏ రోజు రేషన్‌ పంపిణీ చేస్తారో తెలియడం లేదని మారుమూల గ్రామాల ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్‌ వచ్చినప్పుడు సొంత పనిమీద ఇతర ప్రాంతాలకు వెళితే...ఆ నెలకు రేషన్‌ తీసుకునే అవకాశం వుండదని అంటున్నారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం వల్ల తమకు ప్రయోజనంకంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు అంటున్నారు. వచ్చే నెలలో పరిస్థితి మెరుగుపడకపోతే పాత పద్ధతిలోనే జీసీసీ డీఆర్‌ డిపోల ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలని ఆదివాసీలు విజ్ఞప్తిచేస్తున్నారు.

Updated Date - 2021-02-26T05:43:38+05:30 IST