అరకొర రేషన్‌

ABN , First Publish Date - 2021-12-07T06:01:59+05:30 IST

జిల్లాలో బియ్యం కార్డుదారులకు డిసెంబరు నెలలో కందిపప్పు, పంచదార పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది.

అరకొర రేషన్‌

అత్యధిక ప్రాంతాల్లో బియ్యం మాత్రమే పంపిణీ

కోటా కంటే తక్కువగా కందిపప్పు, పంచదార సరఫరా రాక

డీలర్లను నిలదీస్తున్న కార్డుదారులు


విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బియ్యం కార్డుదారులకు డిసెంబరు నెలలో కందిపప్పు, పంచదార పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. జిల్లాకు రావాల్సిన కోటాలో ఇంతవరకు సగం కూడా అందలేదు. దీంతో అత్యధిక రేషన్‌ డిపోల్లో (మొబైల్‌ వ్యాన్లు) బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు, పంచదార గురించి కార్డుదారులు అడిగితే...కోటా ఇంకా రాలేదని, వచ్చిన తరువాత అందజేస్తామని సమాధానమిస్తున్నారు. 


జిల్లాలో సుమారు 11.36 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి బియ్యంతోపాటు కిలో కందిపప్పు, అర కిలో పంచదార పంపిణీ చేస్తుంటారు. పౌర సరఫరా శాఖ అధికారులు ప్రతి నెలా జిల్లాకు ఎంతమేర సరకులు అవసరం అవుతాయో ముందు నెల 20వ తేదన ఇండెంట్‌ పెడతారు. 25వ తేదీలోగా ప్రధాన గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుస్తారు. అక్కడ నుంచి డీలర్లకు సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఒకటో తేదీ కంటే ముందే పూర్తవుతుంది. ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేస్తారు. కానీ డిసెంబరు నెలకు సంబంధించి బియ్యం కోటా సకాలంలోనే వచ్చింది. కందిపప్పు 400 టన్నులకు ఇండెంట్‌ పెట్టగా దాదాపు వారం రోజులు ఆలస్యంగా ఈ నెల మూడో తేదీన, అది కూడా 200 టన్నులు మాత్రమే వచ్చింది. పంచదార 665 టన్నులు అవసరం కాగా, 200 టన్నులే చేరింది. దీంతో చాలా డిపోల్లో కందిపప్పు, పంచదార పంపిణీ చేయడం లేదు. పూర్తిస్థాయిలో కందిపప్పు, పంచదార ఎందుకు సరఫరా చేయలేదో పౌర సరఫరాల అధికారులు చెప్పడం లేదని డీలర్లు అంటున్నారు. దీంతో ఆయా రేషన్‌ డీలర్లు, మొబైల్‌ వాహనదారులు తమకు తోచిన సమాధానం చెబుతుండడంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో కార్డుదారులకు పంపిణీ చేయడానికి పౌర సరఫరాల అధికారులు చోడవరం ఫ్యాక్టరీ నుంచి పంచదారను కొనుగోలు చేస్తున్నారు. బస్తాలను లారీల్లోకి లోడ్‌ చేయడానికి కూలీలు రాకపోవడం, గత బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇప్పటి వరకు 200 టన్నుల పంచదార మాత్రమే సరఫరా అయినట్టు తెలిసింది. పంచదార, కందిపప్పు కొరతపై పౌర సరఫరాల జిల్లా మేనేజరు ఐ.రాజేశ్వరిని వివరణ కోరగా, డిసెంబరు కోటా ఈనెల మూడో తేదీన రావడం, ఈలోగా తుఫాన్‌ కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో సరఫరాలో స్వల్ప జాప్యం జరిగిందని చెప్పారు. మిగిలిన సరకులను రెండు రోజుల్లో డిపోలకు  పంపిస్తామని తెలిపారు. 


మరో 15 మందికి కరోనా నిర్ధారణ

విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 15 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,59,035కు చేరింది. ఇందులో 1,57,697 మంది కోలుకోగా, మరో 234 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో జిల్లాలో 1,104 మంది మృతిచెందారు. 

Updated Date - 2021-12-07T06:01:59+05:30 IST