రాజయ్యపేట ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-12-07T06:03:31+05:30 IST

మండలంలోని రాజయ్యపేటలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హెటెరో ఔషధ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్న పైపులైన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది మత్స్యకారులు గ్రామం నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో మత్స్యకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

రాజయ్యపేట ఉద్రిక్తం
మత్స్యకారులను అడ్డుకుంటున్న పోలీసులు

 హెటెరో పైపులైన్‌ తొలగించాలని మత్స్యకారులు డిమాండ్‌

ఆరు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా పట్టించుకోని అధికారులు

గ్రామం నుంచి తహసీల్దారు కార్యాలయానికి పాదయాత్ర

అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు

ఇరువర్గాల నడుమ వాగ్వాదం

సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ


నక్కపల్లి, డిసెంబరు 6: మండలంలోని రాజయ్యపేటలో సోమవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హెటెరో ఔషధ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్న పైపులైన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది మత్స్యకారులు గ్రామం నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో మత్స్యకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాదయాత్ర ఆపాలంటే ఆర్డీఓ, తహసీల్దారు వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కొద్దిసేపటికి తహసీల్దారు అక్కడకు చేరుకొని, మత్స్యకారులతో మాట్లాడారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు పాదయాత్రను విరమించుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

హెటెరో ఔషధ పరిశ్రమ యాజమాన్యం ఎటువంటి అనుమతుల్లేకుండా రాజయ్యపేట మీదుగా సముద్రంలోకి పైపులైన్‌ నిర్మిస్తున్నదని, ఈ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వున్న పైప్‌లైన్‌ ద్వారా రసాయన వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడున్నారని, దీనివల్ల మత్స్యసంపద నశించిపోతున్నదని, కొత్తగా వేసే పైప్‌లైన్‌తో తాము జీవనోపాధి పూర్తిగా కోల్పోతామని ఆవేదన వ్యక్తంచేశారు. గత బుధవారం నుంచి రాజయ్యపేట సముద్ర తీరంలో శిబిరాన్ని ఏర్పాటుచేసి నిరసన తెలుపుతున్న మత్స్యకారులు...సోమవారం తహసీల్దారు కార్యాలయానికి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న సీఐ నారాయణరావు, నక్కపల్లి, ఎస్‌.రాయవరం,పాయకరావుపేట ఎస్‌ఐలు డి.వెంకన్న, ఎం.శ్రీనివాస్‌, పి.ప్రసాదరావు సిబ్బందితో రాజయ్యపేట చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ మత్స్యకారులను ముందుకు వెళ్లనివ్వలేదు. తాము పాదయాత్ర ఆపాలంటే ఆర్డీఓ, తహసీల్దారు వచ్చి సమాధానం చెప్పాలని మత్స్యకార నాయకులు పట్టుబట్టారు. సీఐ ఫోన్‌ చేసి మాట్లాడడంతో తహసీల్దారు వీవీ రమణ కొద్దిసేపటికి రాజయ్యపేట వచ్చారు. హెటెరో కంపెనీ పైపులైన్‌ ఏర్పాటుచేసేందుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సర్పంచ్‌ పిక్కి అప్పలనర్స, మత్స్యకార నాయకులు ప్రశ్నించారు. తమకు సమాధానం చెబితే తప్ప పాదయాత్రను విరమించబోమని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దారు నర్సీపట్నం ఆర్డీఓకి ఫోన్‌ చేసి మాట్లాడారు. మంగళవారం ఆర్డీఓ వస్తారని, సమగ్ర సర్వే చేయించి, తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు పాదయాత్రను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కంబాల అమ్మోరియ్య, మేరుగు కొర్లయ్య, గరికిన నూకరాజు, మడదా రాంబాబు, పిక్కి కామేశ్వరరావు, పిక్కి స్వామి, కోదండరావు, సత్తియ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T06:03:31+05:30 IST