రైల్వేస్టేషన్‌ కళకళ

ABN , First Publish Date - 2021-07-24T06:05:28+05:30 IST

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ చాలాకాలం తరువాత ప్రయాణికులతో కళకళలాడుతోంది.

రైల్వేస్టేషన్‌ కళకళ

రోజూ 28 రైళ్ల రాకపోకలు

ప్రధాన రైళ్లలో 70 శాతం ఆక్యుపెన్సీ


విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ చాలాకాలం తరువాత ప్రయాణికులతో కళకళలాడుతోంది. కరోనా ఆంక్షలు సడలించడంతో ఇప్పుడు రోజూ 28 రైళ్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అరకు రైలు (కిరండోల్‌)తో పాటు జన్మభూమి, సింహాద్రి, గోదావరి, గరీబ్‌ రథ్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, తిరుమల, రత్నాచల్‌, ఈస్ట్‌కోస్టు, కోణార్క్‌, ఫలక్‌నుమా, రాయపూర్‌ వంటి ప్రధాన రైళ్లు 70 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇంకా దురంతో, డబుల్‌ డెక్కర్‌ (తిరుపతి), ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (విజయవాడ-విశాఖపట్నం), రాయగడ పాసింజర్‌ వంటివి పట్టాలెక్కాల్సి ఉంది. గతంలో అంటే...కరోనాకు ముందు రోజూ 118 రైళ్లు నడిచేవి. ఆ తరువాత కరోనా కారణంగా వాటి సంఖ్య 37కు కుదించారు. వాటిలో ఇప్పుడు 28 మాత్రం నడుస్తున్నాయి. ఇంకా తొమ్మిదింటిని పునఃప్రారంభించాల్సి ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక యథా ప్రకారం అన్ని రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

30 శాతం అధికంగా చార్జీలు

కరోనా కారణంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోయినా రైళ్లను నడపాల్సి వస్తున్నందున నష్టాలను పూడ్చుకోవడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సాధారణ రైళ్లు అన్నింటినీ ‘ప్రత్యేక రైళ్లు’గా నడుపుతోంది. వీటిలో చార్జీలు ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దూరాన్ని బట్టి ఈ భారం పెరుగుతుంది. వంద రూపాయల టిక్కెట్‌ మీద రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే...ఆ మేరకు భారం వేస్తున్నారు. ప్రస్తుతం పేద వర్గాలకు తక్కువ చార్జీలతో పాసింజర్‌ రైళ్లను నడిపే ఆలోచన కనిపించడం లేదు. వాటిని కూడా ఎక్స్‌ప్రెస్‌ల వేగంతో నడుపుతున్నందున..క్రమేపీ అందులోను చార్జీలు పెంచుతారని చెబుతున్నారు. 

Updated Date - 2021-07-24T06:05:28+05:30 IST