గిరిజన సమస్యలకు సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2021-12-30T06:03:53+05:30 IST

మన్యంలో విధులను సక్రమంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌... ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు హితవు పలికారు.

గిరిజన సమస్యలకు సత్వర పరిష్కారం
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

మన్యంలో సక్రమంగా విధులు నిర్వహించాలి

సీఎస్‌ఆర్‌ నిధులతో ఏజెన్సీలో మౌలిక సదుపాయాలు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో డాక్టర్‌ మల్లికార్జున


పాడేరు, డిసెంబరు 29:

మన్యంలో విధులను సక్రమంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌... ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు హితవు పలికారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో రహదారులు, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం సీఎస్‌ఆర్‌ నిధులు ఇచ్చేందుకు వివిధ పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పాడేరు, అరకులోయ, చింతపల్లి ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందేలా చర్యలు చేపడతామని, చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లే వారికి అక్కడ ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ చెప్పారు. డీఈవో ఏజెన్సీలో తరచూ పర్యటిస్తూ ఎంఈవోలతో సమావేశాలు నిర్వహించాలని, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి వచ్చే మార్గాల్లో చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామనిచెప్పారు. 

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ, గిరిజన చిన్నారుల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మన్యంలోని అన్ని విద్యా సంస్థల్లో హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  గిరిజనులు పండిస్తున్న పసుపు, సేకరిస్తున్న అడ్డాకులను రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని, పీహెచ్‌సీల్లో ఖాళీగా వున్న 15 డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు, జేసీ అరుణ్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌ మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


కెరీర్‌ గైడెన్స్‌కు చర్యలు చేపట్టాలి

జి.మాధవి, అరకులోయ ఎంపీ 

గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టడడంతోపాటు కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాలు నిర్వహించాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో వర్కర్ల పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సీఆర్‌టీలను రెన్యువల్‌ చేయాలి.

 

సికిల్‌ సెల్‌ ఎనీమియా పరీక్షలు ఇక్కడే నిర్వహించాలి.

జల్లిపల్లి సుభద్ర, జడ్పీ ఛైర్‌పర్సన్‌ 

సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులు రక్తపరీక్షల కోసం వ్యయప్రయాసలతో కేజీహెచ్‌కి వెళ్లాల్సి వస్తున్నది. ఏజెన్సీలోనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో భోజన మెనూను సక్రమంగా అమలు చేయడం లేదు. అనేక పాఠశాలల్లో నాడు-నేడు పనులను అసంపూర్తి వదిలేశారు. ముంచంగిపుట్టులో డాక్టర్ల నివాసానికి క్వార్టర్లున్నప్పటికీ వైద్యులు స్థానికంగా ఉండడం లేదు.


ఉపాధ్యాయపోస్టులు భర్తీ చేయాలి

 పీవీఎన్‌.మాధవ్‌, ఎమ్మెల్సీ

ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. గిరిజన ప్రత్యేక డీఎస్‌సీ నోటిషికేషన్‌ జారీ చేసి సత్వరమే పోస్టులు భర్తీ చేయాలి. సీఆర్‌టీలు, భాషా వలంటీర్లను సకాలంలో రెన్యువల్‌ చేయాలి. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని పునరుద్ధిరించాలి. గిరిజనుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించి, వారపు సంతల్లో ధరల పట్టికలను ఏర్పాటు చేయాలి. 


విద్యపై కొరవడిన పర్యవేక్షణ

కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే

ఏజెన్సీలో విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విద్యా ప్రమాణాలు కుంటుపడుతున్నాయి. విద్య కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు వృథా అవుతున్నాయి. పాఠశాలల్లో అమర్చిన టీవీలు పని చేయడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్లను నియమించాలి. పీహెచ్‌సీలో వైద్యులకు యాంటీరూమ్‌లు నిర్మించాలి.


డీసీహెచ్‌ఎస్‌ అరకు ఆస్పత్రిని సందర్శించలేదు

చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే 

జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) ఇంతవరకు ఒక్కసారి కూడా అరకులోయ ఏరియా ఆస్పత్రిని సందర్శించలేదు. అతను ఎవరో కూడా ఇంతవరకు నాకు తెలియదు. కనీసం ఇప్పుడైనా ఎమ్మెల్యేని పరిచయం చేసుకోలేదు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. 


ప్రజా సమస్యలను ఏకరువుపెట్టిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమ మండలాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ చెప్పారు. అనంతగిరి మండలంలోని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో అనారోగ్య మరణాలు సంభవిస్తున్నాయని, నాడు-నేడు పనుల్లో నాణ్యత లేదని జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు తెలిపారు. మండలంలో టీచర్ల కొరత అధికంగా ఉందని, పీహెచ్‌సీ  అదనపు భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని ఎంపీపీ చెట్టి నీలవేణి తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎస్‌టీ సెల్‌ ఏర్పాటు చేయాలని ఎంపీపీ రమేశ్‌బాబు కోరారు. కేజీహెచ్‌లో ఎస్‌టీ సెల్‌ పని తీరుబాగోలేదని, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఇంటికి తరలించడానికి వాహన సదుపాయం కల్పించడం లేదని చింతపల్లి జడ్పీటీసీ సభ్యులు పోతురాజు బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పీహెచ్‌సీలో రోగులకు భోజన సదుపాయం కల్పించాలని జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు కోరారు. హుకుంపేట మండలంలో పలు పాఠశాలల భవనాలు శిథిలమయ్యాయని జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం తెలిపారు. 


Updated Date - 2021-12-30T06:03:53+05:30 IST