ముగిసిన ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ
ABN , First Publish Date - 2021-11-06T04:32:43+05:30 IST
జీవీఎంసీ 61వ వార్డులో ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది.

పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, వామపక్షాలు
వైసీపీ, జనసేన మధ్య ప్రధాన పోరు
టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆ అభ్యర్థికే విజయావకాశాలు
మల్కాపురం, నవంబరు 5: జీవీఎంసీ 61వ వార్డులో ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ వార్డు కార్పొరేటర్‌గా వైసీపీ నుంచి దాడి సూర్యకుమారి గెలుపొందిన కొద్ది రోజులకే మృతి చెందడంతో ఈ నెల 15న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాగా వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ దివంగత దాడి సూర్యకుమారి కుమార్తె కొణతాల సుధ శుక్రవారం నామినేషన్ వేయగా, జనసేన నుంచి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మునంపాక నాగవేణి, కాంగ్రెస్ నుంచి రజియా బేగం నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. అలాగే వామపక్ష పార్టీలు కూడా పోటీ చేయడం లేదు.
గతంలో ఇలా..
గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన దాడి సూర్యకుమారికి 2,612 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన సర్వసిద్ధి శ్రీలక్ష్మికి 2,036 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన మునంపాక నాగవేణికి 2,064 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రజియా బేగంకు 270 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్.రామచంద్రకళకు 575 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి వైసీపీ అభ్యర్థి కొణతాల సుధ, జనసేన అభ్యర్థి మునంపాక నాగవేణి మధ్య గట్టి పోటీ జరగనున్నదని పలువురు భావిస్తున్నారు. కాగా టీడీపీ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
61వ వార్డులో 14,089 మంది ఓటర్లు
వార్డులో 14,089 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 7,156, మహిళలు 6,931, ఇతరులు 2 ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 13 ఉండగా, రెండు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి.