తాండవకు గడ్డుకాలం

ABN , First Publish Date - 2021-08-11T05:28:28+05:30 IST

సహకార రంగంలో నడుస్తున్న పాయకరావుపేటలోని తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ ప్రశ్నార్థకంగా మారింది.

తాండవకు గడ్డుకాలం
తాండవ చక్కెర కర్మాగారం

ప్రశ్నార్థకంగా షుగర్‌ ఫ్యాక్టరీ భవిష్యత్తు

రైతులకు రూ.10.65 కోట్ల బకాయిలు

కార్మికులకు 25 నెలలుగా అందని జీతాలు

ఏటేటా తగ్గిపోతున్న క్రషింగ్‌

పదేళ్ల నుంచి పెరిగిపోతున్న నష్టాలు

ప్రభుత్వం నుంచి కొరవడిన చేయూత

ఇంతవరకు మొదలుకాని యంత్రాల ఓవర్‌ హాలింగ్‌ పనులు

వచ్చే సీజన్‌లో క్రషింగ్‌ ప్రశ్నార్థకం


పాయకరావుపేట, ఆగస్టు 10: సహకార రంగంలో నడుస్తున్న పాయకరావుపేటలోని తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ ప్రశ్నార్థకంగా మారింది. సుమారు పదేళ్ల నుంచి నష్టాల్లో నడుస్తున్న ఈ కర్మాగారం...గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. కార్మికులకు రెండేళ్ల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. రానున్న క్రషింగ్‌ సీజన్‌ కోసం యంత్ర పరికరాలకు ఇంతవరకు ఓవర్‌ హాలింగ్‌ పనులు మొదలు పెట్టలేదు. దీనికితోడు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ నుంచి ఎటువంటి భరోసా లభించలేదు. ఇవన్నీ...వచ్చే సీజన్‌లో క్రషింగ్‌ జరిగే అవకాశాలు చాలా తక్కువని చెప్పడానికి బలం చేకూరుస్తున్నాయి. 


పాయకరావుపేటలో 1962లో ‘తాండవ సహకార చక్కెర కర్మాగారం’ ఏర్పాటుచేశారు. రెండు దశాబ్దాల తరువాత ఆధునికీకరణ పనులు చేపట్టి రోజువారీ క్రషింగ్‌ సామర్థ్యాన్ని 1,250 టన్నులకు పెంచారు. మళ్లీ 2001లో దీనిని 1,600 టన్నులకు పెంచారు. పాయకరావుపేట, నర్సీపట్నంతోపాటు తూర్పుగోదావరి జిల్లా తుని, ప్రత్తిపాడు నియోజక వర్గాలకు చెందిన సుమారు 12,000 మంది సభ్య రైతులు ఉన్నారు. 300 మంది వరకు ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి పంచదార ఉత్పత్తి వ్యయం కంటే మార్కెట్‌లో పంచదార అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా వుండడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఏటేటా నష్టాలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. రైతులకు చెరకు బకాయిలు, కార్మికులకు వేతనాలు చెల్లించడానికి పంచదారను బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు చేయాల్సి వస్తున్నది. రానురాను పరిస్థితి మరింత దిగజారిపోయింది. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు చెరకు మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు డబ్బులను ఆలస్యంగా ఇస్తుండడంతో రైతులు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ ప్రభావం ఫాక్టరీ క్రషింగ్‌పై తీవ్రంగా పడింది. ఒకప్పుడు లక్ష టన్నులకుపైగా చెరకు క్రషింగ్‌ చేసిన తాండవ ఫ్యాక్టరీ...గత సీజన్‌లో 40 వేల టన్నులకు పడిపోయింది. దీనికితోడు ఫ్యాక్టరీ యంత్రాలను ఆధునీకరించకపోవడంతో పంచదార రికవరీ శాతం తగ్గిపోయి, రైతులకు ప్రోత్సాహకం అందని పరిస్థితి నెలకొంది. 


రూ.40 కోట్ల నష్టాల్లో ఫ్యాక్టరీ


సుమారు పదేళ్ల నుంచి పంచదార అమ్మకం ధర కంటే ఉత్పత్తి వ్యయం అధికంగా వుండడంతో తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తున్నది. నష్టాలు ఏటేటా పెరుగుతూ...ప్రస్తుతం రూ.40 కోట్లకు చేరాయి. గత సీజన్‌లో ఫ్యాక్టరీకి దాదాపు 40 వేల టన్నుల చెరకును రైతులు సరఫరా చేశారు. క్రషింగ్‌ ముగిసి ఆరు నెలలు దాటింది. రైతులకు రూ.10.65 కోట్లు చెల్లించాల్సి వుండగా ఇంతవరకు  ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఫ్యాక్టరీ కార్మికులకు 25 నెలల జీతాల బకాయిలు సుమారు రూ.10 కోట్ల వరకు పేరుకుపోయాయి. ఇవి ప్రతి నెలా మరింత పెరుగుతున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లింపులు, ఎల్‌ఐసీ, కో-ఆపరేటివ్‌ సొసైటీ బకాయిలు రూ.2 కోట్లు, ఇతరత్రా బకాయిలు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఫ్యాక్టరీ గోదాములో వున్న 34 వేల క్వింటాళ్ల పంచదార ఆప్కాబ్‌ తనఖా (రూ.9.15 కోట్ల అప్పు)లో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఫ్యాక్టరీని సందర్శించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి సానుకూల, ఉపశమన ప్రకటనలు వెలువడలేదు. ఇక రానున్న క్రషింగ్‌ సీజన్‌ కోసం మెషినరీ ఓవర్‌ హాలింగ్‌ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ కారణాలతో వచ్చే సీజన్‌లో చెరకు క్రషింగ్‌ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. 


ప్రభుత్వ నిర్ణయంపైనే క్రషింగ్‌

విక్టర్‌రాజు, ఫ్యాక్టరీ ఇన్‌చార్జి ఎండీ

మూడు లేదా నాలుగు నెలల్లో క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభించాలి. గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంతవరకు చెల్లింపులు జరపలేదు. కార్మికులకు రెండేళ్ల నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఫ్యాక్టరీకి ఇతరత్రా బకాయిలు కూడా ఉన్నాయి. అన్నింటికీ కలిపి రూ.20 కోట్లకుపైగా నిధులు అవసరం. మరోవైపు పంచదార మొత్తం ఆప్కాబ్‌ తనఖాలో ఉంది. వచ్చే సీజన్‌లో క్రషింగ్‌ నిర్వహించాలా? వద్దా? అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Updated Date - 2021-08-11T05:28:28+05:30 IST