లంబసింగిలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-12-09T05:35:03+05:30 IST

పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో పర్యావరణ పరిరక్షణకు రిసార్ట్స్‌ నిర్వాహకులు, పర్యాటకులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

లంబసింగిలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ


ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ

చింతపల్లి, డిసెంబరు 8: పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో పర్యావరణ పరిరక్షణకు రిసార్ట్స్‌ నిర్వాహకులు, పర్యాటకులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. బుధవారం లంబసింగి హైస్కూల్‌లో రిసార్ట్స్‌ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులు కనీస నియమ నిబంధనలు పాటించకపోవడం లంబసింగి డంపింగ్‌ యార్డును తలపిస్తున్నదన్నారు. పర్యాటకులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా పోలీసులు, పంచాయతీ, రిసార్ట్స్‌ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవించడాన్ని నిషేధిస్తున్నామన్నారు. పర్యాటకులు పాటించాల్సిన నిబంధనలను ప్రదర్శిస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసేందుకు అవసరమైన యంత్రాన్ని లంబసింగిలో ఏర్పాటు చేశామన్నారు. రిసార్ట్స్‌లో అసాంఘిక చర్యలకు పాల్పడితే పర్యాటకులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ధరలు పర్యాటకుల నుంచి వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. లంబసింగిలో రిసార్ట్స్‌, టెంట్లను గిరిజనులే నిర్వహించాలన్నారు. తాజంగిలో రూ.మూడు కోట్లతో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించామన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో తాజంగి, కొత్తపాలెం సచివాలయాలు, కిన్నెర్ల ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో కృష్ణకుమారి, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, టూరిజం డీవీఎం బాపూజీ, యూనిట్‌ మేనేజర్‌ అప్పలనాయుడు, టూరిజం సెల్‌ మేనేజర్‌ దాసు, ఎంపీపీ వంతల బాబూరావు, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి, ఎంపీడీవో లాలం సీతయ్య, తహసీల్దార్‌ గోపాలక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T05:35:03+05:30 IST