ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంతో తారుమారైన ఇంటర్‌ పరీక్ష పేపరు

ABN , First Publish Date - 2021-10-07T06:16:22+05:30 IST

కొవిడ్‌ కారణంగా ఇంటర్‌ విద్యార్థులను పాస్‌ చేసినప్పటికీ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది.

ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంతో   తారుమారైన ఇంటర్‌ పరీక్ష పేపరు
మాడుగుల జూనియర్‌ కాలేజీ


వొకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ పేపరు

అయోమయంలో విద్యార్థులు

గంట తర్వాత పేపరు మార్చిన ప్రిన్సిపాల్‌ 

ఆలస్యంగా వెలుగుచూసిన వైనం


మాడుగుల, అక్టోబరు 6: కొవిడ్‌ కారణంగా ఇంటర్‌ విద్యార్థులను పాస్‌ చేసినప్పటికీ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. అయితే ఆ పరీక్షలు సక్రమంగా నిర్వహించాల్సిన ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం కారణంగా వొకేషనల్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నష్టం వాటిల్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలను సెప్టెంబరు 15వ తేదీ నుంచి నిర్వహించింది. సెప్టెంబరు 16వ తేదీ ఉదయం ఇంటర్‌ మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రిన్సిపాల్‌ మొదటి సంవత్సరం వొకేషనల్‌ విద్యార్థులకు ఇవ్వాల్సిన 50 మార్కుల పరీక్ష పేపర్‌కి బదులు జనరల్‌ విద్యార్థులకు సంబంధించిన వంద మార్కుల పేపర్‌ని అందించారు. దీంతో ఇది మా గ్రూపునకు సంబంధించిన పేపరు కాదని విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా.. అన్నీ మాకు తెలుసంటూ కసురుకున్నారని విద్యార్థులు ఆరోపించారు. తీరా గంట తరువాత సమస్యను గుర్తించిన ప్రిన్సిపాల్‌ ఆదరాబాదరాగా విద్యార్థులకు ఇచ్చిన పేపర్లు తిరిగి తీసుకొని.. 50 మార్కులు కలిగిన వొకేషనల్‌ పేపర్‌ను ఇచ్చారు. అప్పటికే సమయం దగ్గర కావడంతో ఆదరాబాదరాగా పరీక్ష రాశామని విద్యార్థులు తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా నిబంధనల పేరుతో అనుమతించని అధికారులు ఇలా గంటకుపైగా విద్యార్థుల పరీక్ష సమయాన్ని వృథా చేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే పరీక్ష విధుల నుంచి ప్రిన్సిపాల్‌, డీవోలను తొలగించి జరిగిన విషయాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డుకి తెలియపరచినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంబంఽధించి ప్రిన్సిపాల్‌ అప్పలసత్యంను వివరణ కోరగా, జరిగిన విషయం వాస్తవమేనన్నారు. పరీక్ష పేపరు తారుమారు అయినట్టు గుర్తించిన వెంటనే దాన్ని సరిదిద్దడం జరిగిందన్నారు. విద్యార్థులకు జరిగిన వృథా సమయాన్ని పొడిగించి పరీక్షను రాయించామన్నారు. 

Updated Date - 2021-10-07T06:16:22+05:30 IST