స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

ABN , First Publish Date - 2021-02-27T05:15:30+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దిలపాలెం జాతీయరహదారి కూడలిలో రాస్తారోకో చేపట్టారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధం
మద్దిలపాలెంలో నిరసన తెలుపుతున్న వివిధ సంఘాల నేతలు

మద్దిలపాలెంలో వివిధ సంఘాల రాస్తారోకో

రోడ్డుపై బైఠాయించి నిరసన  

ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు 

అరెస్టులను ఖండించిన స్టీల్‌ పరిరక్షణ కమిటీ 


మద్దిలపాలెం, ఫిబ్రవరి 26: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దిలపాలెం జాతీయరహదారి కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలి, సొంత గనులు కేటాయించాలని నినదించారు. మద్దిలపాలెం ఆర్టీసీ బస్టాప్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్‌ల్లోకి ఎక్కించి ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంత టి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రజా పోరాటాలతో సాధించిన ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమన్నారు. మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలకు మద్దతివ్వకపోవడం హేయమైన చర్యన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ నగర అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్‌పాండా, జిల్లా కార్యదర్శి వామనమూర్తి, స్టీల్‌ పరిరక్షణ నేతలు రాజు, రమణమూర్తి, పీవోడబ్ల్యుజిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


అక్రమ అరెస్టులు దుర్మార్గం

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చే స్తూ మద్దిలపాలెం కూడలిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని వైజాగ్‌ స్టీల్‌ పరిరక్షణ కమిటీత ోపాటు వామపక్షాలు ఖండించాయి. ఆందోళనలో పాల్గొన్న మహిళలను పోలీసులు కాలితో తన్ని, దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమని కమిటీ సభ్యులు కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం బాహాటంగా ప్రకటిస్తుంటే... దానికి రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారంగా సహకరించడం అత్యంత హేయమైన చర్యని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాఽథం ఒక ప్రకటనలో విమర్శించారు. ఒకవైపు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలుపుతూనే మరోవైపు స్టీల్‌ పరిరక్షణ ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం  చేస్తోందన్నారు. తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్టీల్‌ప్లాంట్‌ను అంత్యంత చౌకగా పోస్కోకి కేంద్ర ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందని, దీనిని రాష్ట్ర ప్రజలంతా సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేయడం దుర్మార్గమని, దీనిని తమపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదంటూ చెబుతూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయాన్ని బహిరంగానే చెప్పిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసి, కేంద్రం దిగివచ్చేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.



Updated Date - 2021-02-27T05:15:30+05:30 IST