బాణసంచా విక్రయాలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-10-29T04:55:35+05:30 IST

దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలు చేపట్టడానికి గోపాలపట్నంలోని బాణసంచా వర్తకులు సన్నాహాలు చేస్తున్నారు.

బాణసంచా విక్రయాలకు సన్నాహాలు
బంక్‌ కూడలిలో బుధవారం సంత ప్రాంగణం పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు

రెండేళ్ల తరువాత మళ్లీ గోపాలపట్నంలో బాణసంచా స్టాళ్లు

2 నుంచి అమ్మకాలు జరిగే అవకాశం


గోపాలపట్నం, అక్టోబరు 28: దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలు చేపట్టడానికి గోపాలపట్నంలోని బాణసంచా వర్తకులు సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి గోపాలపట్నంలో బాణసంచా విక్రయాలు చేపట్టలేదు. 2019లో నగరంలో ఏ ప్రాంతంలో కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో అప్పట్లో విక్రయాలు జరగలేదు. కాగా 2020లో నగరంలో అన్ని ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు అనుమతులిచ్చినా గోపాలపట్నంలో మాత్రం అనుమతులు లభించలేదు. దీంతో గత ఏడాది కూడా ఇక్కడ బాణసంచా విక్రయాలు జరగలేదు. కాగా ఈ ఏడాది బాణసంచా విక్రయాల కోసం ముందస్తుగా వర్తకులు అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే అనుమతుల కోసం సంబంధిత శాఖలకు దరఖాస్తులు చేసుకున్నారు. పూర్తిస్థాయిలో అనుమతులు లభిస్తే నవంబరు 2 నుంచి బాణసంచా విక్రయాలు చేపట్టే అవకాశం ఉంది.

ఈ ఏడాది తగ్గిన దుకాణాలు

గోపాలపట్నం కేంద్రంగా ప్రతి ఏటా దీపావళి సందర్భంగా దాదాపుగా రూ.75లక్షల వరకు బాణసంచా విక్రయాలు జరిగేవి. గోపాలపట్నం బాణసంచా వర్తక సంఘం సభ్యులు ప్రతి ఏటా సుమారుగా 34 స్టాళ్లు ఏర్పాటు చేసి బాణసంచా విక్రయాలు చేసేవారు. కాగా ఈ ఏడాది 24 మంది సభ్యులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపారు. స్టాళ్ల ఏర్పాటుకు ఖర్చులు పెరగడంతో పాటు బాణసంచా ధరలు పెరగడం, జీఎస్టీ తదితర కారణాల వల్ల పలువురు వర్తకులు ముందుకు రాలేదు. దీంతో గోపాలపట్నంలో ఈ ఏడాది 24 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు వర్తక సంఘం సభ్యులు తెలిపారు.

Updated Date - 2021-10-29T04:55:35+05:30 IST