కేజీబీవీ పోస్టులకు పోటా పోటీ

ABN , First Publish Date - 2021-12-08T06:02:32+05:30 IST

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పోస్టులకు నిరుద్యోగ మహిళా అభ్యర్థినుల నుంచి పెద్దఎత్తున పోటీ నెలకొంది. కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌, సీఆర్‌టీ, పీజీటీ, పీఈటీ పోస్టులు మొత్తం 178 ఖాళీలుండగా మంగళవారం వరకు 2,308 దరఖాస్తులు వచ్చాయి.

కేజీబీవీ పోస్టులకు పోటా పోటీ

178 పోస్టులకు 2,308 దరఖాస్తులు

నేటితో ముగియనున్న గడువు

18న పోస్టింగ్స్‌ 

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పోస్టులకు నిరుద్యోగ మహిళా అభ్యర్థినుల నుంచి పెద్దఎత్తున పోటీ నెలకొంది. కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌, సీఆర్‌టీ, పీజీటీ, పీఈటీ పోస్టులు మొత్తం 178 ఖాళీలుండగా మంగళవారం వరకు 2,308 దరఖాస్తులు వచ్చాయి. వీటిని స్వీకరించేందుకు జీసీడీవో రాజేశ్వరి నేతృత్వంలో సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు.  అయితే దరఖాస్తు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో, కార్యాలయం బయట చెట్ల కింద, మెట్ల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఈనెల నాలుగో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బుధవారంతో గడువు ముగియనున్నది. ఈనెల 9, 10న దరఖాస్తులను పరిశీలించి 11న ప్రొవిజినల్‌ జాబితా ప్రదర్శిస్తారు. ఆ రోజు నుంచి 14 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈనెల 16న మెరిట్‌ జాబితా ప్రదర్శించి 18న పోస్టింగ్స్‌ ఇస్తారు.  జిల్లాలో ఏజెన్సీలో పది కేజీబీవీలకు గత ఏడాది వరకు రెగ్యులర్‌ టీచర్లు ప్రిన్సిపాళ్లుగా ఉండేవారు. ప్రభుత్వం వారందరినీ మాతృసంస్థకు పంపేయడంతో  ఖాళీలు ఏర్పడ్డాయి. మైదానంలో మరో నాలుగుఖాళీలతో కలసి 14 ప్రిన్సిపాళ్ల పోస్టులకు మంగళవారం వరకు 294 మంది దరఖాస్తు చేశారు. 52 సీఆర్‌టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లు) పోస్టులకు 1,183 మంది, 112 పీజీటీలకు 672 మంది, రెండు పీఈటీ పోస్టులకు 159 మంది దరఖాస్తు చేశారు. జిల్లాలో 34 కేజీబీవీలకు గాను ఈ ఏడాది 17 కేజీబీవీల్లో ఇంటర్‌ కోర్సులు ప్రారంభించడంతో పీజీటీ పోస్టులు అవసరమయ్యాయి. గతంలో 17 కేజీబీవీల్లో ఇంటర్‌ కోర్సులు అమలుచేసినపుడు కొంతమంది పీజీటీలను నియమించినా, వారిలో కొందరు విధులకు స్వస్తి పలికారు. ప్రస్తుతం బోధనా సిబ్బంది కొరతతో నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మార్కుల ప్రాతిపదికన పోస్టుల ఎంపికపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత, మౌఖిక పరీక్ష నిర్వహిస్తే ప్రతిభావంతులైన అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని సీనియర్‌ టీచర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. మార్కుల ప్రాతిపదికగా ఎంపిక చేయడంవల్ల పైరవీ లేకపోయినా... పీజీ, డిగ్రీ చేసిన అభ్యర్థుల సీనియార్టీకి వెయిటేజీ ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2021-12-08T06:02:32+05:30 IST