మేడివాడలో జనాగ్రహం

ABN , First Publish Date - 2021-10-28T06:12:04+05:30 IST

మేడివాడ గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పేలుడు ఘటనకు సంబంధించి మరో మహిళ మృతి చెందడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మేడివాడలో జనాగ్రహం
గ్రామస్థులు ధ్వంసం చేసిన దుకాణం, మందుగుండు సామగ్రి

వృద్ధురాలి మృతితో కట్టలు తెంచుకున్న గ్రామస్థులు

వ్యాపారి దుకాణాలు, మందుగుండు సామగ్రి ధ్వంసం

బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్‌

మృతదేహంతో ఆందోళనకు నిర్ణయం

సీఐ హామీతో శాంతించిన గ్రామస్థులు


రావికమతం, అక్టోబరు 27: మేడివాడ గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పేలుడు ఘటనకు సంబంధించి మరో మహిళ మృతి చెందడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బుధవారం మందుగుండు వ్యాపారి దుకాణాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు.

మేడివాడ గ్రామంలో కొనగళ్ల శివ ఇంటిలో నిల్వ వుంచిన మందుగుండు సామగ్రి విస్పోటం జరగడంతో అతని తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు ఇళ్లు నేలమట్టం కాగా, మరో పది ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నడిపల్లి దేవుడమ్మ (60) మృతి చెందినట్టు సమాచారం తెలియడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా గాయపడ్డ వృద్ధురాలి వైద్య సేవల నిమిత్తం ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని కోరుతున్నా వ్యాపారి పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో పార్టీలకు అతీతంగా గ్రామస్థులు ఏకతాటిపైకి వచ్చి వ్యాపారి దుకాణాలను, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు. అంతేకాకుండా మృతదేహంతో ఆందోళనకు దిగాలని నిర్ణయించారు.  

ఈ విషయం తెలియడంతో కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి సిబ్బందితో హుటాహుటిన వచ్చి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. క్షణికావేశంతో తప్పుడు పనులకు పాల్పడి నేరస్థులు కాకూడదని సూచించారు. ఇప్పటికే వ్యాపారిపై కఠినమైన కేసులు నమోదు చేశామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.


Updated Date - 2021-10-28T06:12:04+05:30 IST