రాజకీయ కదలిక

ABN , First Publish Date - 2021-02-08T06:58:43+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా రక్షించడానికి విశాఖలో అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వస్తున్నాయి.

రాజకీయ కదలిక
చేతులు కలిపి సంఘీభావం ప్రకటిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, వామపక్షాలు, ఉక్కు కార్మిక సంఘాల నాయకులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు నేతల ముందడుగు

ప్రభుత్వ అతిథిగృహంలో మంత్రి ముత్తంశెట్టి సమావేశం

హాజరైన పలు కార్మిక సంఘాల నేతలు

బీజేపీ, జనసేన కూడా కలిసిరావాలన్న మంత్రి 

కేంద్రానికి సీఎం జగన్‌ లేఖతో వైసీపీ శ్రేణుల్లో కదలిక

రాజీనామాకు సిద్ధమన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

రాజకీయేతర జేఏసీ ఏర్పాటు చేద్దామన్న గంటా

విశాఖ ప్రజల మనోభావాలు ఢిల్లీలో చెబుతామన్న పురందేశ్వరి

మద్దతు ప్రకటించిన ఏపీఎన్‌జీఓల సంఘం


విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా రక్షించడానికి విశాఖలో అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌... స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వాటాను ఈక్విటీగా మార్చాలని ప్రధానికి లేఖ రాయడంతో వైసీపీ నేతలంతా విశాఖ ఉక్కుపై మాట్లాడటానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఉత్తుత్తి పోరాటాలతో ప్రయోజనం లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎంతోమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎవరితోనూ చర్చించంంకుండా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ, జనసేన నేతలు స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే బీజేపీ నేతలతో తాము కూడా ఢిల్లీకి వెళతామన్నారు. సాయంత్రం ప్రభుత్వ అతిథిగృహంలో వామపక్షాలు, విశాఖ ఉక్కు యూనియన్ల నాయకులతో సమావేశమై.... కర్మాగారం పరిరక్షణకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుస్సాహసమని, ఆంధ్రులకు అవమానకరమని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీలక తీతంగా కేంద్ర నిర్ణయంపై పోరాడతామని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన కార్యాలయంలో విశాఖ ఉక్కు యూనియన్‌ నాయకులతో చర్చించి, కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. అవసరమైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వెనుక ఎటువంటి రాజకీయం లేదని, లక్షలాది మంది ఆధారపడిన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని గంటా శ్రీనివాసరావు.... ఆదివారం తనను కలిసిన వామపక్ష నాయకులు, ఉక్కు కార్మిక సంఘాల నాయకులకు చెప్పారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి రాజకీయేతర జేఏసీని ఏర్పాటుచేసి ముందుకువెళదామని వారికి వివరించారు. 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రత్యక్ష ఉద్యమాలు చేస్తామని టీడీపీ విశాఖ పార్లమెంట్‌  అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ జోలికి వస్తే సహించేది లేదని,  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

విశాఖ ఉక్కును ప్రైవేట్‌టుపరం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో చేరాలని ఆదివారం విశాఖలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. 

 బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, విశాఖ ప్రజల భావోద్వేగాలను, సెంటిమెంట్‌ను, ఇక్కడి పరిస్థితులను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులంతా కలిసి ఈ నెల 14న ఢిల్లీ వెళతామని ప్రకటించారు.



Updated Date - 2021-02-08T06:58:43+05:30 IST