రండి...బాబూ రండి!

ABN , First Publish Date - 2021-08-10T05:30:00+05:30 IST

ఏళ్ల తరబడి రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది.

రండి...బాబూ రండి!

కాంట్రాక్టర్లకు ఆర్‌ అండ్‌ బి అధికారుల ఆహ్వానం

కొత్తగా పనులు చేపట్టేందుకు టెండర్లు వేయాల్సిందిగా పిలుపు

బిల్లులు చెల్లించకపోవడంతో దూరంగా ఉంటున్న కాంట్రాక్టర్లు

బకాయిలు క్లియర్‌ చేయిస్తామని హామీ ఇస్తున్న ఉన్నతాధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏళ్ల తరబడి రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఏ పనులకూ కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో పనులకు టెండర్లు వేయాల్సిందిగా ఉన్నతాధికారులు కోరుతుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అధికారుల మాట కాదనలేక బిడ్డింగ్‌లో పాల్గొన్నా...పనులు చేయాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిందేనని అంటున్నారు. 


ముచ్చటగా మూడోసారి నో..

డీజిల్‌పై సెస్‌ రూపేణా వచ్చే మొత్తాన్ని ష్యూరిటీగా పెట్టి తీసుకువచ్చే రుణంతో కొత్తగా రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,200 కోట్ల విలువజేసే పనులు చేపట్టాలని భావిస్తుండగా, అందులో జిల్లాకు సంబంధించి సుమారు రూ.60 కోట్ల పనులు వున్నట్టు చెబుతున్నారు. ఈ పనులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో టెండరింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించగా, ఒకటి రెండు పనులకు...అదీ ఒకరిద్దరు మాత్రమే టెండర్లు వేశారు. మిగిలిన పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఈ నెలలో మరోసారి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఈసారి జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కొంతమంది టెండర్ల ప్రక్రియలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యతను స్థానిక ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులపై పెట్టినట్టు తెలిసింది. దీంతో ఆయా కాంట్రాక్టర్లతో జిల్లాకు చెందిన అధికారులు మాట్లాడుతున్నారు. పాత బకాయిలను వీలైనంత వేగంగా క్లియర్‌ చేసేలా చూడడంతోపాటు..కొత్తగా చేపట్టే పనులకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిసింది. దీంతో నిన్నమొన్నటి వరకూ పనులకు దూరంగా వుండాలని భావించిన కొంతమంది...కొన్నింటికైనా టెండర్లు వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, టెండరింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఎలా వుంటుందో తెలియదని, అప్పటి పరిస్థితులను బట్టి చూస్తామని కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీనిపై కాంట్రాక్టర్లంతా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదనను మరికొందరు చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా ఆర్‌అండ్‌బీ శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా  పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు రావాలంటూ అధికారులే కోరుతుండడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. 

Updated Date - 2021-08-10T05:30:00+05:30 IST