కదలని పెట్రో వర్సిటీ పనులు

ABN , First Publish Date - 2021-12-15T05:55:02+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇందుకోసం సేకరించాల్సిన భూములకు సంబంధించిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

కదలని పెట్రో వర్సిటీ పనులు
ప్రహరీ నిర్మాణంతో నిలిచిపోయిన వర్సీటీ పనులు

శాశ్వత ప్రాంగణ నిర్మాణానికి రూ.650 కోట్లు  

ఇప్పటికే ఐఐపీఈ ఖాతాలోకి రూ.450 కోట్లు జమ చేసిన కేంద్రం 

భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎక్కడి పనులక్కడే 

(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం) 

 ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.  ఇందుకోసం సేకరించాల్సిన భూములకు సంబంధించిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో  నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని రాష్ట్రానికి కేటాయించింది. తాత్కాలికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తరగతులను నిర్వహిస్తున్నారు.  శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్బవరం మండలంలోని వంగలి గ్రామంలో 201 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా 2016 అక్టోబరు 20న శంకుస్థాపన కూడా చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.650 కోట్లు  అందించనుంది. ఇప్పటికే రూ.450 కోట్లను ఐఐపీఈ ఖాతాలో చేసింది. పనుల ప్రగతిని బట్టి మరో రూ.200 కోట్లు  విడుదల చేయనుంది. శంకుస్థాపన పూర్తి చేసి ఐదేళ్లు దాటుతున్నా, నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. 

తేలని భూ పంచాయితీ.. 

ఐఐపీఈ క్యాంపస్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 201 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భూమి నష్టపోయిన రైతులకు బీ ఫారం ఉంటే రూ.13 లక్షలు, భీ పారం లేని రైతులకు రూ.7 లక్షల చొప్పున చెల్లించారు.  వీరిలో 25 మంది రైతులకు ప్రభుత్వం రూ.7 లక్షల  చొప్పున నష్టం పరిహారం చెల్లించడానికి నిర్ణయించింది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు.. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ననేపథ్యంలో కోర్టు స్టే విధించింది. చెల్లింపులు పూర్తయ్యే వరకు నిర్మాణం వాయిదా వేయాలని సూచించింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఐఐపీఈ అధికారులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులకు విన్నవించారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చేసిన యత్నాలు విఫలం కావడంతో పనులు ముందుకు సాగలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వివా దం లేని 176 ఎకరాల భూమిని ఐఐపీఈ పేరు మీదు టైటిట్‌ డీడ్‌ చేయించే పనిలో అధికారులున్నారు. 


ఐదేళ్లలో ప్రహరీ మాత్రమే.. 

 ఐఐపీఈ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి ఐదేళ్ల కిందటే శంకుస్థాపన చేసినప్పటికీ.. ఇప్పటివరకు ప్రహరీని మాత్రమే నిర్మించారు. అది కూడా మఽధ్యలోనే నిలిచిపోయింది. క్యాంపస్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుగుణంగా తక్షణమే  అధికారులు భూ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాలయానికి అడ్డంకులు తొలగించాలని, ఇందుకోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-12-15T05:55:02+05:30 IST