ప్చ్‌.. కొవిడ్‌ కాటేస్తున్నా.. మారని మనుషులు!

ABN , First Publish Date - 2021-06-21T05:33:46+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్రంగా ప్రాణభయం కలిగించింది.

ప్చ్‌.. కొవిడ్‌ కాటేస్తున్నా.. మారని మనుషులు!
అడ్డరోడ్డు-తిమ్మాపురం చేపల మార్కెట్‌ వద్ద రద్దీ

ఎస్‌.రాయవరం, జూన్‌ 20 : కరోనా సెకండ్‌ వేవ్‌ పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్రంగా ప్రాణభయం కలిగించింది. ఇంకా పాజిటివ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోలేదు. ప్రభుత్వం కూడా కర్ఫ్యూ పూర్తి ఎత్తివేయలేదు. వైద్యాధికారులు పదేపదే భౌతిక దూరం పాటించాలని మొత్తుకుంటున్నారు. కానీ చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అదెక్కడా అమలు కావడం లేదనే చెప్పాలి. ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు-తిమ్మాపురం చేపల మార్కెట్‌ వద్ద ఆది వారం ఉదయం గుంపులు గుంపులుగా జనం కనిపించారు. కనీసం మనిషికి, మనిషికీ మధ్య సెంటీమీటరు కూడా ఖాళీ లేనంతగా చేపల  కొనుగోలుకు ఎగబడ్డారు. దీంతో ఈ దృశ్యాన్ని చూసివారంతా భయాందోళనకు గురయ్యారు.  ఎవరికి వారే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే కరోనా ఎలా తగ్గుతుందంటూ విస్మయానికి వ్యక్తం చేశారు. ఈ మార్కెట్టు వద్ద భౌతిక దూరం పాటించేలా రెవెన్యూ అధికారులు గాని, పోలీసులు గాని కనీస చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపించాయి. చేపలు కొనేందుకు వచ్చిన వారిలో కొద్ది మంది మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం.

Updated Date - 2021-06-21T05:33:46+05:30 IST