పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలకు ఎన్నికలు
ABN , First Publish Date - 2021-09-03T06:25:45+05:30 IST
పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు 16న నోటిఫికేషన్ జారీచేస్తారు.

16న నోటిఫికేషన్ 22న ఎన్నిక
ప్రాథమిక పాఠశాలలో 15, ప్రాథమికోన్నత పాఠశాలలో 24 మంది, ఉన్నత పాఠశాలలో 9 మంది సభ్యులు
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు 16న నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ షెడ్యూల్ జారీచేసింది. జిల్లాలో 4,133 ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల కమిటీ ఎన్నికలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరికి ఓటు హక్కు ఉంటుంది. పిల్లలు వేర్వేరు తరగతులు, వేర్వేరు పాఠశాలల్లో చదువుతుంటే తల్లిదండ్రులు ఇరువురు చెరొకచోట ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల అధికారిగా ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసిన రోజే ఓటర్ల జాబితాలను పాఠశాలలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎన్నికైన కమిటీ సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరిలో ఒకరు ఎస్సీ/ఎస్టీ/బీసీలకు చెందినవారు, మరొకరు మహిళ వుండాలని పాఠశాల విద్యా శాఖ జారీచేసిన షెడ్యూల్‌లో పేర్కొంది.
ఒక్కో తరగతికి ముగ్గురు సభ్యులు...
పాఠశాల కమిటీలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. ప్రాథమిక పాఠశాలలో 15 మందిని, ప్రాథమికోన్నత పాఠశాల అయితే ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు 24 మంది, ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు తొమ్మిది మందిని ఎన్నుకుంటారు. ఒక్కో కమిటీకి ఆరుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులను నియమించుకునే అధికారం ఉంది. వీరిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ వార్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
నాడు-నేడు పనులతో పదవులకు పోటీ
నాడు-నేడు రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పాఠశాల స్థాయిని బట్టి భారీగానే నిధులు విడుదల కానున్నాయి. విద్యా కమిటీల పరిధి లోనే ఇవి జరగనున్నాయి. దీంతో పాఠశాల కమిటీల్లో స్థానానికి తీవ్ర పోటీ జరి గేలా ఉంది. మొదటి దశ నాడు-నేడు పనుల్లో కొన్నిచోట్ల కమిటీ సభ్యులకు భారీగా సొమ్ములు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యా కానుకలు, పాఠశాల నిర్వహణకు నిధులు విడుదల...వంటి వాటి కారణంగా కమిటీ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా వుంటుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మూజువాణి విధానంలో ఓటింగ్ జరుగు తుంది. ఒకవేళ పోటీ వుంటే రహస్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.