వాల్తేరు డివిజన్‌లో పాసింజర్‌ కమిటీ పర్యటన

ABN , First Publish Date - 2021-10-07T06:22:03+05:30 IST

రైల్వే బోర్డుకు చెందిన పాసింజర్‌ కమిటీ వాల్తేరు డివిజన్‌ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో మూడు రోజులపాటు పర్యటించి తనిఖీలు చేపట్టారు.

వాల్తేరు డివిజన్‌లో పాసింజర్‌ కమిటీ పర్యటన
క్యాటరింగ్‌ స్టాల్‌లో ఆహార పదార్థాల నాణ్యత పరిశీలిస్తున్న కమిటీ సభ్యులు

సదుపాయాల కల్పన, నిర్వహణపై సంతృప్తి

విశాఖపట్నం, అక్టోబరు 6: రైల్వే బోర్డుకు చెందిన పాసింజర్‌ కమిటీ వాల్తేరు డివిజన్‌ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో మూడు రోజులపాటు పర్యటించి తనిఖీలు చేపట్టారు. గంగాధర్‌ తలుపుల, జయంతిలాల్‌ జైన్‌, సురమ పాధీతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ తొలిరోజు విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, రెండో రోజు రాయగడ, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో పర్యటించారు.  చివరి రోజైన బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో పర్యటించి తాగునీటి సౌకర్యం, వెయింటింగ్‌ హాల్స్‌, మరుగుదొడ్లు సదుపాయం, ప్లాట్‌ఫాంలపై ఏర్పాటు చేసిన కుర్చీలు, లిఫ్టు, ఎస్కలేటర్‌ వంటి ప్రాథమిక సౌకర్యాల నిర్వహణను తనిఖీలు చేశారు. అలాగే స్టేషన్‌లోని పరిశుభ్రత, క్యాటరింగ్‌ స్టాల్స్‌లో లభించే ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడి స్టేషన్‌లో సదుపాయాల నిర్వహణపై అభిప్రాయాలను సేకరించారు.   అంతకుముందు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ స్టేషన్‌లో చేపడుతున్న ఆధునిక సదుపాయాల అభివృద్ధి పనులు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలను వివరించారు. తనిఖీల అనంతరం ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తాతో జరిగిన సమావేశంలో కమిటీ బృంద సభ్యులు మాట్లాడుతూ  స్టేషన్‌లో పారిశుధ్య నిర్వహణ, ఆధునిక సౌకర్యాల కల్పన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ పర్యటనలో కమిటీ బృందంతో సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి, సీనియర్‌ డీఈఎన్‌(హెడ్‌ క్వార్టర్స్‌) ప్రభాకరరావు, ఎలక్ర్టికల్‌, సివిల్‌ ఇంజనీర్లు, సిగ్నిల్‌ అండ్‌ టెలికాం అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-07T06:22:03+05:30 IST