పంచాయతీ కోలాహలం

ABN , First Publish Date - 2021-02-05T07:11:26+05:30 IST

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నర్సీపట్నం డివిజన్‌లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది.

పంచాయతీ కోలాహలం
రావికమతం మండలం కొత్తకోటలో నామినేషన్లు వేసేందుకు రాత్రి 9 గంటలకు వేచివున్న అభ్యర్థులు

నర్సీపట్నం డివిజన్‌లో నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు

చివరిరోజు కావడంతో పోటెత్తిన అభ్యర్థులు

కొన్నిచోట్ల రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా స్వీకరణ

10 మండలాలు...261 పంచాయతీలు

సర్పంచ్‌ పదవులకు 1,768 నామినేషన్లు

2,584 వార్డులకు 8,438 నామినేషన్లు


విశాఖపట్నం/నర్సీపట్నం, ఫిబ్రవరి 4:  జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నర్సీపట్నం డివిజన్‌లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నామినేషన్‌ పత్రాలతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను పరిశీలించాల్సి వుండడంతో పలుచోట్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగింది. సాయంత్రం ఐదు గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి వుండగా, ఆ సమయానికి పదుల సంఖ్యలో అభ్యర్థులు క్యూలో వేచివున్నారు. వీరందరికీ ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేశారు. అనంతరం నంబర్ల వారీగా పిలుస్తూ నామినేషన్లు స్వీకరించారు. కొన్ని పంచాయతీల్లో రాత్రి పది గంటల సమయానికి కూడా నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. నర్సీపట్నం డివిజన్‌లోని పది మండలాల్లో 261 పంచాయతీలు, 2,584 వార్డులకు నామినేషన్ల దాఖలు మంగళవారం ప్రారంభం కాగా గురువారం ముగిసింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 1,768 నామినేషన్లు, వార్డు పదవులకు 8,438 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నర్సీపట్నం మండలంలో 13 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 41, వార్డులకు 229, గొలుగొండలో సర్పంచులకు 86, వార్డులకు 551, మాకవరపాలెంలో సర్పంచులకు 115, వార్డులకు 756, నాతవరంలో సర్పంచులకు 107, వార్డులకు 252, పాయకరావుపేటలో సర్పంచుకు 73, వార్డులకు 666, కోటవురట్లలో సర్పంచులకు 106, వార్డులకు 586, నక్కపల్లిలో సర్పంచులకు 83, వార్డులకు 484, ఎస్‌.రాయవరంలో సర్పంచులకు 89, వార్డులకు 507, రోలుగుంటలో సర్పంచులకు 111, వార్డులకు 552, రావికమతంలో సర్పంచులకు 82, వార్డులకు 581 నామినేషన్లు పడ్డాయి.


తొలివిడతలో 44 పంచాయతీలు ఏకగ్రీవం

730 వార్డులు కూడా...

అత్యధికంగా ఎలమంచిలి నియోజకవర్గంలో 17 పంచాయతీలు...

మాడుగులలో 16, చోడవరంలో తొమ్మిది, అనకాపల్లిలో రెండు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక

పలుచోట్ల ముఖాముఖి, త్రిముఖ పోటీ

అర్ధరాత్రి తరువాతే అభ్యర్థుల వివరాలు వెల్లడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే అనకాపల్లి డివిజన్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. గురువారం రాత్రి 12 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు 44 గ్రామ సర్పంచ్‌ పదవులు, 730 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. ప్రతి మండలంలో పంచాయతీల వారీగా సర్పంచ్‌, వార్డు పదవులకు బరిలో వున్న అభ్యర్థుల వివరాలను ఖరారు చేసే పనిలో స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులు నిమగ్నమయ్యారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించేసరికి అర్ధరాత్రి దాటుతుందని చెబుతున్నారు. అనకాపల్లి డివిజన్‌లోని 12 మండలాల్లో 340 పంచాయతీలకు మినేషన్లు, 3,250 వార్డులకు 9,525 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల ఒకటో తేదీన పరిశీలన అనంతరం సర్పంచ్‌ పదవులకు 1,857, వార్డు పదవులకు 9,425 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో తుది జాబితాల ఖరారులో అధికారులు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఏకగ్రీవ పంచాయతీలు, వార్డులు మినహాయిస్తే...కె.కోటపాడు మండలంలో 27 సర్పంచ్‌ పదవులకు 60 మంది, చీడికాడలో 23 సర్పంచ్‌ పదవులకు 44 మంది, ఎలమంచిలి మండలంలో 15 సర్పంచ్‌లకు 35 మంది, అనకాపల్లిలో 32 సర్పంచ్‌ పదవులకు 108 మంది, బుచ్చెయ్యపేటలో 29 సర్పంచ్‌ పదవులకు 78 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన మండలాల్లో పోటీలో వున్న అభ్యర్థులు, ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయిన 44 పంచాయతీలకుగాను 40 పంచాయతీల్లో వార్డు పదవులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో రంగంలో ఉన్న అభ్యర్థులు శుక్రవారం నుంచి ప్రచారంపై దృష్టిసారించనున్నారు. ఈ నెల తొమ్మిదిన పోలింగ్‌ జరగనుండడంతో ఏడో తేదీ సాయంత్రం వరకే ప్రచారానికి అవకాశం ఉంది.

Updated Date - 2021-02-05T07:11:26+05:30 IST