పంచాయతీ ఎన్నికలను బహిష్కరించండి
ABN , First Publish Date - 2021-02-01T07:06:00+05:30 IST
: పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు విశాఖ-ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు.

మావోయిస్టు విశాఖ-ఈస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ
విశాఖపట్నం, జనవరి 31: పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు విశాఖ-ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం ముసుగులో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలు పాలకవర్గాల దోపిడీకి దోహదపడుతున్నాయన్నారు. ఈ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి రహిత పాలన అంటున్నాడని, తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేల కోట్ల రాష్ట్ర సంపదను దోచుకున్నాడని, ఇప్పటికీ ఈ అక్రమ సంపాదనపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయన్నారు. జీవో నంబర్ 97ను రద్దుచేసి బాక్సైట్ తవ్వకాలను వెలికితీసేదిలేదని హామీ ఇచ్చిన జగన్ మాకవరపాలెం అన్‌రాక్ కంపెనీకి బాక్సైట్ సరఫరా చేసేందుకు 89 జీవోను రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చాడన్నారు. ఆదివాసీలు పోరాడి సాధించుకున్న జీవో-3 సుప్రీంకోర్టు రద్దు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తినప్పటికీ జగన్ ప్రభుత్వం ఇంతవరకు దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు.