పాడేరు టీడబ్ల్యూ డీడీ పోస్టుకు జోరుగా పైరవీలు

ABN , First Publish Date - 2021-12-31T06:27:02+05:30 IST

గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉపసంచాలకుడు పోస్టుకు రాష్ట్ర స్థాయిలో జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ప్రస్తుతం టీడబ్ల్యూ డీడీగా ఉన్న విజయకుమార్‌ శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు.

పాడేరు టీడబ్ల్యూ డీడీ పోస్టుకు జోరుగా పైరవీలు


 తెరపైకి ముగ్గురు అధికారుల పేర్లు..

 ప్రస్తుత డీడీ విజయకుమార్‌ నేడు పదవీవిరమణ 

పాడేరు, డిసెంబరు 30: గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉపసంచాలకుడు పోస్టుకు రాష్ట్ర స్థాయిలో జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ప్రస్తుతం టీడబ్ల్యూ డీడీగా ఉన్న విజయకుమార్‌ శుక్రవారం పదవీవిరమణ చేయనున్నారు. దీంతో ఈ పోస్టును దక్కించుకునేందుకు గిరిజన సంక్షేమ శాఖలోని ముగ్గురు అధికారులు పావులు కదుపుతున్నారు. దీంతో పాడేరు టీడబ్ల్యూ డీడీగా ఎవరు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పెద్ద ఐటీడీఏగా ఉన్న పాడేరు గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉపసంచాలకుడు పోస్టుకు మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ మినహా రాష్ట్రంలోని ఏ ఐటీడీఏలోనూ టీడబ్ల్యూ డీడీ పోస్టుకు పెద్ద గిరాకీ ఉండదు. ముఖ్యంగా విస్తీర్ణం పరంగా పెద్దది కావడంతో 122 ఆశ్రమ పాఠశాలలు, 25 కాలేజీ హాస్టళ్లతో మొత్తం 62 వేల మంది గిరిజన విద్యార్థులకు పెద్దదిక్కుగా టీడబ్ల్యూ డీడీ ఉంటారు. ఐటీడీఏ పీవో తర్వాత ఆ స్థాయిలో పలుకుబడి ఉండేది ఈ పోస్టుకే. దీంతో పాడేరులో టీడబ్ల్యూ డీడీగా చేయాలని గిరిజన సంక్షేమ శాఖలోని పనిచేసే ఎక్కువ మంది అఽధికారులు ఎంతో ఆశ పడతారు. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం వేచి చూస్తున్న మణికుమార్‌ అనే అధికారి, సీతంపేట ఐటీడీఏలో టీడబ్ల్యూ డీడీగా ఉన్న కమల, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కొండలరావు టీడబ్ల్యూ డీడీ పోస్టుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. మరో రెండు రోజుల్లో డీడీ పోస్టును ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు తెరపడుతుందని అందరూ భావిస్తున్నారు.


 

Updated Date - 2021-12-31T06:27:02+05:30 IST