పడకేసిన పంచాయతీలు

ABN , First Publish Date - 2021-11-28T06:14:38+05:30 IST

‘‘మా పంచాయతీకి దేశం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీఽధిలైట్ల నిర్వహణ, రోడ్లు వంటివి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీదే.

పడకేసిన పంచాయతీలు
14, 15 ఆర్థిక సంఘం నిధులు తీసేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

సాధారణ నిధులపైనా ఫ్రీజింగ్‌

సర్పంచుల గగ్గోలు

పాలన ఎలా సాగించాలంటూ ఆందోళన

ప్రజల నుంచి తప్పించుకు తిరుగుతున్న వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘మా పంచాయతీకి దేశం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీఽధిలైట్ల నిర్వహణ, రోడ్లు వంటివి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీదే. నేను సర్పంచ్‌గా ఎన్నికై తొమ్మిది నెలలైంది. కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. పంచాయతీలకు పన్నుల రూపేణా సమకూరే సాధారణ నిధులపై ఫ్రీజింగ్‌ ఉంది. ఉత్తమ పంచాయతీగా ఎన్నిక కావడంతో దీనదయాల్‌ పురస్కారం కింద కేంద్రం పంచాయతీకి గతంలో రూ.15 లక్షలు ఇచ్చింది. ఆ నిధులనే ఇప్పటివరకు పారిశుధ్య, లైట్ల నిర్వహణ, సిబ్బందికి జీతాలకు ఖర్చు చేశాం. అవి అయిపోయాయి. ఇక పంచాయతీ నిర్వహణ ఎలా అనేది ఆగమ్యగోచరంగా ఉంది.’’     -పి.దాసుబాబు, పెదలబుడు (అరకులోయ) సర్పంచ్‌

స్వయం సమృద్ధి సాధించేలా పంచాయతీలకు చేయాతనివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం...అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వాటి బలోపేతానికి సహకరించడం లేదు సరికదా...కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసేసుకుంటోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న విద్యుత్‌ బిల్లులు కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని ప్రకటించింది. అయితే పంచాయతీలు చెల్లించాల్సిన బకాయిలు ఏ మేరకు ఉన్నదీ...ఐదు నెలలైనా లెక్క తేల్చలేదు. ఈ విషయంంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వేధింపులకు గురికావలసి వస్తుందనే భయంతో చాలామంది సర్పంచులు మౌనంగా ఉండిపోయారు. ఈలోగా 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాలకు జమ కావడంతో సంతోషించారు. పెండింగ్‌ బిల్లుల మంజూరుకోసం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈలోగా ఆ నిధులపై ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించింది. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా వారెవరూ సీఎం దృష్టికి తీసుకువెళ్లే సాహసం చేయలేకపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం జిల్లాలోని మెజారిటీ పంచాయతీల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా తీసేసుకుంది. కొన్ని పంచాయతీల్లో నిధులు వున్నప్పటికీ ఖర్చు చేయకుండా ఫ్రీజింగ్‌లో ఉంచేసింది. దీనికితోడు సాధారణ నిధులు కూడా ఫ్రీజింగ్‌ చేసింది. అంటే...పంచాయతీ ఖాతా నుంచి దమ్మిడీ కూడా తీసుకునే అవకాశం సర్పంచులకు లేకుండా చేసింది. 

భవిష్యత్తు ఆగమ్యగోచరం

పంచాయతీల పరిధిలో ప్రతిరోజు చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి. పారిశుధ్యం, తాగునీరు  వీధి దీపాల నిర్వహణ, రోడ్లు, కాలువల నిర్మాణం, మరమ్మతులు వంటివి చేయాలి. పారిశుధ్యం కోసం బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర మెటీరియల్‌ కొనుగోలు చేయాలి. మేజర్‌ పంచాయతీల్లో వీటికి నెలకు రూ.మూడు లక్షల నుంచి ఏడెనిమిది లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. పంచాయతీ ఖాతాల నుంచి పైసా ఖర్చు చేయడానికి వీలు లేదని...ఈ పరిస్థితుల్లో తామేం చేయగలమని పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో వైసీపీ సానుభూతిపరులైన సర్పంచులు అధికంగా ఉన్నారు. దీంతో అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక...ఇటు పంచాయతీల్లో పనుల చేయలేక  నలిగిపోతున్నారు. ఎన్నికైన మొదటి తొమ్మిది నెలల్లోనే పరిస్థితి ఇలావుంటే...వచ్చే నాలుగేళ్ల కాలంలో పంచాయతీలను ఎలా నడపాలనేది తలుచుకుంటేనే భయమేస్తోందని పలువురు సర్పంచులు వాపోతున్నారు. ఇప్పటివరకు బ్లీచింగ్‌, వీధిలైట్లు, ఇతర మెటీరియల్‌ అరువు ఇచ్చిన వ్యాపారులు ఇప్పుడు ససేమిరా అంటున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


పాలన చేయడం సాధ్యంకాదు

వానపిల్లి లక్ష్మి, సర్పంచ్‌, గంభీరం, ఆనందపురం మంఙడలం


ఏడువేల జనాభా కలిగిన గంభీరం పంచాయతీ పరిధిలో ఐఐఎం, పారిశ్రామికవాడ, కొన్ని ఐటీ సంస్థలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ప్రాంతం. పారిశుధ్యం కోసం 15 మంది సిబ్బంది ఉన్నారు. వీధి దీపాలు, తాగునీటి నిర్వహణ చేపట్టాలి. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.25 లక్షలను ప్రభుత్వం తీసేసుకుంది. పంచాయతీలో పన్నుల రూపేణా వసూలు చేసిన రూ.29 లక్షలు సాధారణ నిధుల ఖాతాకు జమచేశాం. ఆ నిధుల వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 15వ ఆర్థిక సంఘం కింద వచ్చిన రూ.27 లక్షలపై కూడా ఫ్రీజింగ్‌ ఉంది. దీంతో పంచాయతీలో ఏమీ చేయడం సాధ్యంకావడం లేదు. బయటకు వెళితే...పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికై ఏడాది కాకముందే ఇలా వుంటే వచ్చే నాలుగేళ్లలో పాలన ఎలా నిర్వహించాలో తెలియడం లేదు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేవు.

Updated Date - 2021-11-28T06:14:38+05:30 IST